సికింద్రాబాద్, మార్చి 10: గ్యాస్.. ఫుడ్ ఇండస్ట్రీకి ప్రాణవాయువు లాంటిదని, ప్రస్తుతం సరిపడా సరఫరా లేకపోవడంతో ఫుడ్ ఇండస్ట్రీ పూర్తిగా మూసివేసే పరిస్థితి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర హోట్ల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గ్యాస్ నిల్వల సమస్య ఏర్పడనుందని కనీసం వారం రోజుల ముందుగానే తెలియజేస్తే ప్రత్యాన్మయ ఏర్పాట్లు చేసుకునేవారమని అన్నారు.
కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు కేవలం ఒకరోజు ముందుగా ప్రకటించడం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతునాయని చెప్పారు. ఇప్పటికే చాలా హోటల్స్‌లో గ్యాస్ నిల్వలు అయిపోయి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఫుడ్ ఇండస్ట్రీ భారీ నష్టాలను చూడాల్సి వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 నుంచి 50 వేల వరకు హోటల్లు (పెద్దవి, చిన్నవి) కొనసాగుతున్నాయని, వాటిపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. కేవలం హైదరబాద్ నగరంలోనే 7వేలకు పైచిలుకు పెద్దచిన్న హోటల్లు ఉన్నాయన్నారు. అంతే కాకుండా ఫుడ్ కోర్టులని, టిఫిన్ సెంటర్లని, భోజన శాలలు, తోపుడు బండ్లపై నడుస్తున్న టిఫిన్ సెంటర్లు దాదాపు 20వేలకు పైగా ఉన్నాయన్నారు.
లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయి..
నగరంలోని దాదాపు 3వేలకు పైగా ఉన్న హోటల్స్‌లలో టూరిస్టులు అనేక మంది ఉన్నారని, వారికి అవసరమైన ఫుడ్ ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలని వెంకటరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే గ్యాస్ సరఫరా పెంచేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో రైల్వే తరువాత రెండో అతిపెద్ద ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ అని.. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ కొనసాగకపోతే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకొని ఇప్పటివరకు సరఫరా చేస్తున్న దానిలో కనీసం 50శాతం గ్యాస్ సరఫరా చేసినా సర్దుకుపోతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ కోశాధికారి రాంమూర్తి, సెక్రటరీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.