అందోల్, మార్చి 10: సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదా యం వద్ద పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. అందోల్లోని(కుమ్మరిగూడెం) డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో కొద్దిరోజులుగా మురుగు ఇండ్ల పక్కనే ప్రవహిస్తుండడంతో దుర్గందంతో స్థానికులు ముక్కుమూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాలనీలో మురుగునీరు వెళ్లే పైప్లైన్లు దెబ్బతినడంతో మురుగు రోడ్లపై చేరడంతో పాటు ఇండ్లలోకి ఎదురు ప్రవహిస్తున్నదని స్థానికులు తెలిపారు.
ఈ విషయంపై సంబంధిత అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలు, కూలీనాలి చేసుకుని బతికే వారికి సొంతింటి కలను సాకారం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చింది. లబ్ధిదారుల నుంచి పైసా తీసుకోకుండా కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేశారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్వహణ బాగుండేందని, ఎప్పటికప్పుడు పరిసరాలు శుభ్రం చేసేవారని, ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కష్టాలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మురుగు వెళ్లకపోవడం, ఇండ్లముందు, రోడ్లపై గుంతలు ఏర్పడి దుర్గంధంతో కంపు భరించలేక పోతున్నామని, దోమలు విజృంభిస్తుండడంతో విషజ్వరాల బారిన పడుతున్నామని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు స్పందించి డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.