జూలూరుపాడు, ఆగస్టు 10 : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో సోమవారం జూలూరుపాడు మండల కేంద్రంలో భారీ రాస్తారోకో, జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐటీయూ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పూనెం ఝాన్సీ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన సభలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి యాసా నరేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి దేశ సంపదను దోచిపెడుతుండటంతో మరో ఉద్యమం అనివార్యమైందన్నారు. ఈ కార్పొరేట్ అనుకూల పాలనకు స్వస్తి పలకాలనే లక్ష్యంతోనే దేశవ్యాప్తంగా నిర్వహించిన జైల్ భరో కార్యక్రమం దిగ్విజయమైందని తెలిపారు. మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా కార్మిక చట్టాలను మార్చి, నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం ద్వారా కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసిందని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలని, విదేశీ వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ స్వదేశీ రైతుల నడుము విరిచే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా పునరుద్ధరించాలని, వీబీజీరామ్ జీ చట్టంతో పాటు నూతన విత్తన, విద్యుత్ సవరణ చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి క్లిష్టమైన యాప్లు లేదా డిజిటల్ నిబంధనల ప్రమేయం లేకుండా సకాలంలో, ఉచితంగా ఎరువులు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. కార్మిక, కర్షక ఐక్యతతోనే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మండల కార్యదర్శి వల్లోజు రమేష్, రైతు సంఘం మండల కార్యదర్శి గడిదేసి కనకరత్నం, సీఐటీయూ మండల కార్యదర్శి బోడా అభిమిత్ర, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు పద్దం సుగుణ, మండల నాయకులు ఇల్లంగి సీతారాములు, ఉడల వెంకటేశ్వర్లు, గార్లపాటి వెంకటి, తాటి ఇందిర, లక్ష్మయ్య, నరసింహారావు, రమేష్, కృష్ణ, నీలం రమేష్, సామ్య, దానయ్య పాల్గొన్నారు.