రామగిరి, ఆగస్టు 10 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ‘జైల్ భరో’ కార్యక్రమం నల్లగొండలో ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని స్థానిక సుభాష్ విగ్రహం నుండి పెద్ద గడియారం వరకు వందలాది మంది కార్మికులు, రైతులు, మహిళలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కలెక్టర్ బంగ్లా సమీపానికి చేరుకోగానే పోలీసులు నాయకులను అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం నయా ఉదారవాద సంస్కరణల పేరుతో కార్మికుల, రైతుల హక్కులను కాలరాస్తోందని తీవ్రంగా విమర్శించారు. లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు, రైతులకు మద్దతు ధరలు కల్పించేవరకు ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో అవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హశం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, సహాయ కార్యదర్శి అవుట రవీందర్, రైతు సంఘం జిల్లా నాయకులు నలపరాజు సైదులు, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండా అనురాధ, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న పాల్గొన్నారు. అలాగే సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, గంజి రాజేష్, కత్తుల యాదయ్య, సుంకరబోయిన వెంకన్న, సాగర్ల మల్లయ్య, పేర్ల సంజీవ, గౌరీదేవి, మధుసూదన్, కట్ట అంజయ్య, కండే యాదగిరి, బొల్లు రవీందర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

‘ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నశించాలి’