గుమ్మడిదల, మార్చి 10: సంగారెడ్డి జిల్లా అన్నారంలోని 261 సర్వేనంబర్‌లో రైతుల భూములను రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్కు కోసం గుంజుకోవడానికి యత్నిస్తే చూస్తూ ఊరుకోమని, రైతులు గజం భూమి కోల్పోకుండా ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఆ భూములను ఎమ్మెల్యే పరిశీలించారు. 261 సర్వే నంబర్ భూమిలో 117 మంది పేద రైతులకు కేసీఆర్ పట్టాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభు త్వం ఇండస్ట్ట్రియల్ పార్కుల పేరిట రియల్ ఎస్టేట్ చేయడానికి టీజీఐఐసీకి విలువైన భూములను కేటాయిస్తూ కోట్ల రూపాయలను దండుకుంటుందని ఆరోపించారు. 261 సర్వే నంబర్లో 587 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉన్నాయని, ఇందులో ఇప్పటికే కొంతమంది రియల్ వ్యాపారుల చేతికి వెళ్లాయని, వారు ప్రహరీలు నిర్మించి భూములు కబ్జా చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అధికారులతో కుమ్మక్కై అసైన్డ్ భూములు చేతులు మారుతున్నట్లు ఆరోపించారు. ప్రజాపాలన సాగిస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్, రైతులను ఆగంచేస్తున్నదని మండిపడ్డారు. టీజీఐఐసీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాదిరిగా వ్యవహరిస్తూ అంగట్లో కూరగాయలు అమ్మినట్లు ఇష్టారాజ్యంగా భూములు విక్రయిస్తున్నదని విమర్శించారు.
ప్రజా అవసరాల కోసం రైతులను ఒప్పించి, మెరుగైన నష్టపరిహారం అందించి భూములు తీసుకోవడం దేశవ్యాప్తంగా జరుగుతున్నదని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రైతులను బెదిరించి అక్రమంగా, అన్యాయంగా పచ్చని పంట భూములను లాక్కుంటున్నదని మండిపడ్డారు. అన్నారం భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే వేలాది మంది రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్, సె్రక్రటేరియట్, టీజీఐఐసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ సీహెచ్ కుమార్‌గౌడ్, కౌన్సిలరు సంజీవరెడ్డి, మురళీ,రాధికరాజు, కిషన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, నరహరి, మాజీ సర్పంచ్‌లు రుక్మారెడ్డి, ఐలయ్య, దర్గ బిక్షపతి, సప్పటి మహేశ్‌యాదవ్, బాలకిషన్, డప్పు శ్రీనివాస్, చాకలి పాపయ్య, మస్కూరి నర్సింగ్‌రావు, దొంతుల బాలమణి, బాధిత రైతులు పాల్గొన్నారు.