మేడిపల్లి, మే 29 : దళిత బంధు కింద వాహనం, ఉద్యోగం ఇప్పిస్తానని రిటైర్డ్ ఉద్యోగి వద్ద ఓ ఘనుడు 25 లక్షల నగదు కాజేసిన ఘటన మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ రాధాకృష్ణకాలనీ కి చెందిన బుడుత వినోద్‌కుమార్ కు (62) నాలుగేళ్ల క్రితం ఖైరతాబాద్ ఆనంద్ నగర్‌కు చెందిన చంద్రగిరి శ్రీకాంత్ (35) పరిచయం అయ్యాడు. వినోద్‌కుమార్ పెద్ద కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ తొలుత 2.12 లక్షలు అనంతరం 6లక్షలు వసూల్ చేశాడు.
చిన్న కుమారుడికి ఉద్యోగం పేరిట 2.12 కుమార్తె శ్వేతకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ 4లక్షలు తీసుకున్నాడు. దళిత బంధు కింద వాహనం మంజూరు చేయిస్తానని మరో 2లక్షలు వ్యక్తి గత అవసరాల కోసం 8లక్షలు అతని వద్ద నుండి గుంజాడు. మొత్తం 25 లక్షలు తీసుకున్నప్పటికి ఉద్యోగాలు లేవు. దళిత బంధుకింద వాహనం లేదు. మోసపోయానని గుర్తించిన బాధితుడు డబ్బులు తిరిగి ఇవ్వమని శ్రీకాంత్‌ను అడిగితే చెక్కులు ఇచ్చాడు. అవి బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితుడు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.