Car Accident | ఘట్ కేసర్, జూన్ 7: విద్యుత్ స్థంబాన్ని కారు డీకొట్టిన సంఘటనలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధి ఎదులాబాద్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. ఇన్ స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్ కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ గ్రామ సమీపంలో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్నఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు భార్గవ్, వర్షిత్ అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
హయత్ నగర్ మండలం కుంట్లూరుకు చెందిన బత్తుల భార్గవ్ యాదవ్(23), సైనిక్ పురికి చెందిన చేతి వర్షిత్(22), ఓల్డ్ అల్వాల్‌కి చెందిన ప్రవీణ్, వైజాగ్‌కు చెందిన దినేష్ .. నలుగురు యాక్సెంచర్ కంపెనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఎదులాబాద్ సమీపంలోని విహారి ఫామ్ హౌస్‌లో శుక్రవారం సాయంత్రం వీకెండ్ పార్టీ చేసుకున్నారు. అయితే మండలం అర్ధరాత్రి దాటిన తర్వాత క్రెటా కారు(టీఎస్ 08 హెచ్ఇ 5796)లో తిరిగి ఇంటికి వెళ్లుతుండగా ఎదులాబాద్ సమీపంలోని మాదారం చౌరస్తా వద్ద వేగంగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో కారు వెనుక డోర్ ఊడిపోయింది. కారులో ఉన్న భార్గవ్ యాదవ్, వర్షిత్ లు కిందపడగా తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్‌కు తీవ్ర గాయాలు కాగా.. దినేష్‌కు ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రవీణ్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నగరంలోని గాంధీ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు