Charlapalli | బోడుప్పల్, ఏప్రిల్ 3: రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నట్లు చెంగిచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ కవిత తెలిపారు. ఉదయం 4.20 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. చంగిచర్ల డిపోలో శనివారం డిపో మేనేజర్ కవిత మీడియాతో మాట్లాడుతూ.. చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి మణుగూరు, చెన్నై ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైళ్లు ప్రతి రోజు ఉదయం చేరుకుంటున్నందుకు వారి కోసం బస్సు సౌకర్యం కల్పించినట్లు వివరించారు.
చర్లపల్లి నుంచి సికింద్రాబాద్ వయా మల్లాపూర్, హబ్సిగూడ మీదుగా వెళ్లే 250సీ రూట్ బస్సులు ఉదయం 4.20 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక్క బస్సు నడుస్తున్నట్లు చెప్పారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఉప్పల్ మీదుగా చార్మినార్ వెళ్లే రూట్ నెంబర్ 71ఏ ఉదయం 5.20 నుంచి రాత్రి 8.40 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఒక్క బస్సు, చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి పటాన్ చెరుకు ఉదయం 4.25 నుంచి 9.50 గంట వరకు ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు, పటాన్ చెరు నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ కు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3.15 వరకు ప్రతి 30 నిమిషాలకు ఒక్క బస్సు, చర్లపల్లి నుంచి ఈసీఐఎల్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే రూట్ నెంబర్ 18హెచ్ ఉదయం 4.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక్క బస్సు, చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఉప్పల్, ఎల్ బీ నగర్ మీదుగా మెహిదీపట్నం వెళ్లే రూట్ నెంబర్ 300 ఉదయం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఉప్పల్, రామంతాపూర్, హిమాయత్ నగర్ మీదుగా బోరబండకు వెళ్లే రూట్ నెంబర్ 113ఎఫ్ ఉదయం 8.35 గంటల నుంచి రాత్రి 7.35 గంటల వరకు నడుపుతున్నట్లు తెలిపారు. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఉప్పల్ మీదుగా 139 బస్ సర్వీసులను నడుపుతుండగా ఇటీవల మరో 123 బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.