మేడ్చల్, మార్చి 13 : హక్కులపై ప్రశ్నించడమే నేరమా? గవర్నర్ ప్రసంగంలో అసత్యలాపై మాట్లాడితే సస్పెన్షన్ శిక్ష వేస్తారా అని కాంగ్రెస్(Congress) ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపు మేరకు అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌కు నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. మేడ్చల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై వివేకానంద విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. పూర్తిగా విఫలమైన ప్రభుత్వ పాలనపై నుంచి దృష్టించి పక్కకు తప్పించడానికి ఇలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. హామీల అమలు ఎక్కడ జరిగిందో చూపాలని ప్రశ్నించారు. రైతుబంధు లేదు, రుణమాఫీ పూర్తిగా అమలు కాదు, తులం బంగారం ఇచ్చింది లేదు, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఎక్కడో చెప్పాలని డిమాండ్ చేశారు. అమలుకు నోచుకోని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ర్ట పరిపాలనలో పూర్తిగా విఫలమైందన్నారు.
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయకుండా పోలీసులు అడ్డకునే ప్రయత్నం చేయడంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారుల చేతుల్లో నుంచి దిష్టిబొమ్మను లాక్కునే ప్రయత్నం చేయడంతో బొమ్మ రెండు ముక్కలైంది. ఆ బొమ్మను తగులబెట్టి బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఆందోళన అనంతరం బీఆర్ఎస్ నాయకులు పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించి, సొంత పూచీకత్తపై వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, నాయకులు విష్ణుచారి, సుదర్శన్, జగన్ రెడ్డి,రాజమల్లారెడ్డి, శ్రీనివాస్ రాజు, సందీప్ గౌడ్, రాజు, నవీన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వెంకటేశ్ ముదిరాజ్, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.