MLA Rajashekhar Reddy | మల్కాజ్గిరి, ఫిబ్రవరి 21 : రానున్న ఎండాకాలంలో ప్రజలకు నీటికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో నీటి సమస్యలపై వాటర్ వర్క్స్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో నెలకొన్న నీటి సమస్యలను అధికారులు పరిష్కరించాలన్నారు. కౌకుర్లోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో దాదాపు 20 ఏండ్ల నుండి మంచినీటి కనెక్షన్లు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తూ, అక్రమ నీటి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న స్థానిక హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ మేనేజర్ మల్లిఖార్జున్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం కాకుండా రాజకీయ నాయకుల కోసం పని చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, జీఎం సునీల్ సమక్షంలోనే అన్నారు.
నేరేడుమెట్ డివిజన్ పరిధిలోని సీబీఎన్ కాలనీలో ఏడు సంవత్సరాల నుండి పైపులైన్ లీకేజీ ద్వారా మంచి నీరు వృధా అవుతున్నా, ఎన్నో సార్లు అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇప్పుడైనా లీకేజిని అరికట్టాలని అన్నారు. కౌకూర్ ప్రాంతంలోని జనప్రియా ఆర్కేడ్ అపార్టుమెంటులో నివాసముంటున్న 600 కుటుంబాల నుండి ఒక కోటి ఎనబై అయిదు లక్షలు డిపాజిట్ కట్టించుకుని నామమాత్రంగా కేవలం నాలుగు నెలలు మంచినీటి సరఫరా చేసి సాంకేతిక కారణాలు చూపుతూ, నీటి సరఫరాను నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. ఎండాకాలం వచ్చేలోపు నీటి సరఫరాను పునరుద్ధరించాలని జీఎంను కోరారు. మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని జీఏసీ కాలనీల సమస్యను వెంటనే పరిష్కరించాలని, ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 2కు కొత్త లైన్లు వేసి వీలైనంత త్వరగా మంచినీటి కనెక్షన్లు ఇవ్వాలని, లక్ష్మమ్మ ఎంక్లెవ్ నీటి సమస్యను కూడా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జీఎం సునీల్, డీజీఎంలు సాంబయ్య, ఆశ్రిత, రాజు, మేనేజర్లు నవీన్, మల్లిఖార్జున్, తేజస్విని, సృజయ్, కార్పొరేటర్లు విజయ శాంతి రెడ్డి, సునీత యాదవ్, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, ఆకుల నర్సింగ్ రావు, నాయకులు పరమేశ్, రాము యాదవ్, ఉస్మాన్, లక్ష్మణ్ యాదవ్, యాదగిరి గౌడ్, ప్రశాంత్ రెడ్డి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.