KP Vivekananda | కుత్బుల్లాపూర్, మే 2: డబుల్ బెడ్రూం సముదాయాల్లో కనీస మౌలిక వసతులను కల్పించలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. దుండిగల్, డి.పోచంపల్లి, బాచుపల్లి, నిజాంపేట డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఎమ్మెల్యే కేపీ వివేకానందను చింతల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం కలిశారు. తమకు తాగు నీరు, భూగర్భ డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు.
వేసవి కాలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో మంచినీరు సరఫరా సరిగ్గా లేదని ఎమ్మెల్యేకు డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు తమ గోడు వెల్లబోసుకున్నారు. విద్యా సంవత్సరం మొదలవుతుండటంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న లబ్ధిదారులు డబుల్ బెడ్రూం ఇళ్లలోకి మారుతున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో మౌలిక వసతులు కల్పించలేని ప్రభుత్వం.. ఖాళీగా ఉన్న ఇళ్ల లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల వినతిపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద సానుకూలంగా స్పందించారు. మౌలిక వసతుల కల్పనపై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారని తెలిపారు. కానీ వాటిలో మౌలిక సదుపాయలను కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. డిమాండ్‌కు తగ్గ మంచినీటి సరఫరా లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. లబ్ధిదారులకు మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు.