Malla Reddy | కీసర, మార్చి 22: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, గోధుమకుంట మాజీ ఎంపీటీసీ మంచాల పెంటయ్య, మాజీ పంచాయతీ సభ్యులు తుడుం శ్రీనివాస్‌లతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి మల్లారెడ్డిని శనివారం నాడు కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. గ్రామాల్లో పనులు పూర్తిగా ఆగిపోయాయని మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు తప్పు చేశామని పశ్చాత్తాపం చెందుతున్నారని అన్నారు. బంగారం లాంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోస్తే బతుకుదెరువే గగనమైపోయిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ప్రజల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పోయిందని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడలంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమైపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలందరూ ఓపిగ్గా ఉండాలని మల్లారెడ్డి సూచించారు. వచ్చే రోజులు మనవేనని.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.