ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 7 : పది వేల రూపాయల లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ బిల్ కలెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్ పట్టుబడ్డాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ పంచాయతీలో బిల్ కలెక్టర్గా పని చేస్తున్న రవిందర్ను పంచాయతీ పరిధిలో ఉన్న తార్నాకు చెందిన సిగ్నీ ఆంటోని తన ఇల్లును దుబాయిలో ఉన్న తల్లి పేరు మీద మ్యూటేషన్ చేయాలని కోరాడు. అందుకు గాను రూ.20 వేలు లంచం ఇవ్వాలని రవిందర్ డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే పని జరుగదని తేల్చి చెప్పాడు. 20 వేలు ఇవ్వలేనని 10 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు.
దీంతో బాధితుడు చేసేది లేక ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు.. గురువారం ఉదయం పంచాయతీ కార్యాలయంలో ఆంటోని నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.