హైదరాబాద్ : ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఎస్ఎస్ఆర్ నగర్లో నివాసముండే అశోక్ కుమార్, రూప దంపతుల కూతురు విహారిక (20) బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ.. ఇంటి దగ్గరలో ఉండే కిశోర్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే పెళ్లి చేసుకుందామని యువతి అడగడంతో సదరు యువకుడు నిరాకరించాడు.
దీంతో విహారిక ఈ నెల 16న ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా, 18వ తేదీన ఇంటికి తిరిగొచ్చిన యువతి.. అయితే ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.