కీసర, జూన్ 8: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అంబేద్కర్ సంఘం నేతలు కృషి చేయడం చాలా అభినందనీయమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల కేంద్రంలో ఆదివారం డాక్టర్ బీఆర్. అంబేద్కర్ 175వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చామకూర మల్లారెడ్డితో పాటు ఆస్ర్టేలియా డెలిగేషన్ మినిస్టర్స్, పార్లమెంట్ సెక్రటరీలు పాల్గొని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో బోనాలు, బతుకమ్మలతో ఆస్ర్టేలియా బృందానికి కీసర మహిళ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఆస్ర్టేలియా షీనా వాట్ ఎంపీకి మల్లారెడ్డి బతుకమ్మను ఎత్తారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆస్ర్టేలియా నుంచి వచ్చిన ఆస్ర్టేలియా డెలిగేషన్ మినిస్టర్, పార్లమెంట్ సెక్రటరీలు ఇండియాకు వచ్చి కీసరలోని అంబేద్కర్‌కు జ్ఞానమాలను సమర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మండల అంబేద్కర్ అధ్యక్షులు కొమ్ము సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్‌లు ఆస్ర్టేలియా బృందానికి డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని అందించి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుర్రం మల్లారెడ్డి స్వచ్ఛంద సంస్థ చైర్మన్, ఆస్ర్టేలియా డెలిగేషన్ కన్వీనర్ గుర్రం శ్రీధర్‌రెడ్డి, ఆస్ర్టేలియా డెలిగేషన్ మినిస్టర్స్ పాలిన్ రిచర్డ్స్, పార్లమెంట్ సెక్రటరీ బెలిండా విల్సన్, జాలియన్ ఆడిసన్, అనిల్ కొలన్, మండల నేతలు నాయకపు వెంకటేశ్ ముదిరాజ్, గుర్రం మల్లారెడ్డి, సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.
కీసరగుట్టలో పూజలు
ఆస్ర్టేలియో బృందం వారంతా కీసరలో అంబేద్కర్‌కు జ్ఞానమాల అనంతరం కీసరగుట్టకు వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ సిబ్బంది వారికి ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వారిని శాలువలతో ఘనంగా సత్కారించారు.