Hyderabad | మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పరిధిలో దారుణం జరిగింది. కన్నతండ్రినే ఓ కొడుకు కిరాతకంగా హత్య చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి (45) ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పనిచేస్తున్నాడు. అతని కుమారుడు సాయికుమార్ కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే మద్యానికి బానిసైన మొగిలి.. నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తుండేవాడు. కుటుంబ కలహాలతో పాటు వీరిమధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి. దీంతో విసిగిపోయిన సాయికుమార్.. తండ్రినే హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి బస్సులో వెళ్తున్న మొగలిని సాయికుమార్ ఫాలో అయ్యాడు.
ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద మొగిలి బస్సు దిగగానే.. వెనుకనుంచి వెళ్లి కత్తితో దాడి చేశాడు. దాదాపు 15 సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఇది గమనించిన స్థానికులు మొగిలిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మొగిలి కన్నుమూశాడు. తండ్రి మీద నడిరోడ్డుపై కొడుకు దాడి చేసిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.