మేడ్చల్, డిసెంబరు 15 : ఆశాలపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్నతి కృష్ణన్ మాట్లాడుతూ జిల్లాలో పని ఆశా కార్యకర్తలను ఆన్లైన్ పేరుతో దుర్బషలాడుతూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. అధికారుల తీరును డీఎంహెచ్వో దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితి మారలేదన్నారు. ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.
లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అందులో భాగంగా ఐదు రోజుల పాటు దీక్ష చేయాలని, 22న కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. సిఐటీయూ జిల్లా నాయకుడు కిష్టప్ప మాట్లాడుతూ అధికారులు మహిళలను చూడకుండా వేధిస్తే ఊరుకోమన్నారు. ఆశాల వేతనాన్ని ఆపే హక్కు వైద్యాధికారులకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఆన్లైన్లో నమోదుకు ఫోన్, నెట్ రీచార్జీ, శిక్షణ లేకుండా చేయడం ఎలా సాధ్యమన్నారు. డీఎంహెచ్వో జోక్యం చేసుకొని, సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నాలో జిల్లా కార్యదర్శి రేవతి కల్యాణి, జిల్లా కోశాధికారి రాధ, నాయకురాళ్లు లత, జయప్రద, కవిత, కీసర, చర్లపల్లి, మల్లాపూర్ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.