Tragedy | కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 10: పెళ్లయిన ఏ భార్యభర్తలకు అయినా సరే అమ్మానాన్న అని అనిపించుకోవాలని ఉంటుంది. కానీ ఆ కోరిక అందరికీ తీరదు. కొంతమందికి పెళ్లయి సంవత్సరాలు గడిచిపోయినా పిల్లలు పుట్టరు… అలాంటిది లేకలేక పిల్లలు పుడితే.. పుట్టిన వాళ్లు.. పుట్టినట్టే చనిపోతే ఎలా ఉంటుంది.. అలాంటి పరిస్థితే హైదరాబాద్‌లోని ఓ దంపతులకు ఎదురైంది. దీంతో దంపతులిద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆ విరక్తితోనే భర్త తాగుడుకు బానిసవ్వగా.. భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోదండరాం అనే వ్యక్తికి అదే జిల్లాకు చెందిన దేవి (28)తో 2015లో వివాహమైంది. పెళ్లయిన తర్వాత బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. సుభాష్‌నగర్ డివిజన్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కోదండరాం ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే పుట్టిన మొదటి పాప పుట్టిన తర్వాత నెలరోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందింది. ఆ తర్వాత పుట్టిన మరో పాప కూడా నెల రోజుల్లోపే అనారోగ్యంతో మరణించింది. ఇలా పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా నెలరోజుల్లోనే మరణించడంతో వాళ్లు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
ఆ బాధతోనే కోదండరాం మానసిక వేదనకు గురయ్యాడు. అలాగే మద్యానికి బానిసయ్యాడు. ఒకవైపు పుట్టిన పిల్లలు నెల రోజుల్లోనే చనిపోగా.. భర్త ఏమో తాగుడు బానిస కావడంతో తీవ్ర వేదనకు గురైన దేవి జీవితంపై విరక్తి పెంచుకుంది. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి భర్త పడుకున్న తర్వాత.. తాము ఉంటున్న రేకుల ఇంట్లోని రాడ్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలిని పరిశీలించిన పేట్ బషీరాబాద్ పోలీసులు దేవి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.