మల్కాజిగిరి, మే 5 : సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మచ్చబొల్లారం డివిజన్ లక్ష్మమ్మ ఎన్‌క్లేవ్‌లో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు.
అనంతరం మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గుంతలు పడిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించామని అన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు లేకుండా పనులను అధికారులు పరిశీలిస్తారని చెప్పారు. సర్కిల్ పరిధిలోని అన్ని రోడ్లను అధికారులతో సర్వే చేయించి, అవసరమైన కాలనీల్లో వెంటనే సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు.
దళారులకు ధాన్యం విక్రయించవద్దు : మల్లారెడ్డి
శామీర్‌పేట: రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయదారుల సేవా సహకార సంఘం కృషిచేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలంలోని వ్యవసాయదారుల సేవా సహకార సంఘం కార్యాలయం, ఆలియాబాద్‌లోని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డితో కలసి సోమవారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. దళారులకు ధాన్యం విక్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు.