రంగారెడ్డి, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : నగర శివారులో ఉన్న ఔటర్‌రింగ్‌రోడ్డును కేంద్రంగా చేసుకుని గంజాయి రవాణాదారులు గుట్టుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడా జాతీయ రహదారి నుంచి వివిధ వాహనాల్లో ఓఆర్ఆర్ మీదుగా ముంబాయి నేషనల్ హైవే మార్గం ద్వారా గంజాయి రవాణా పెద్ద ఎత్తున సాగుతున్నది. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు, ఎస్ఓటీ, నార్కోటెక్ విభాగాలు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నప్పటికీ అక్రమ రవాణా ఆగటంలేదు. ఔటర్‌రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, ఆదిబట్ల, మొయినాబాద్, నార్సింగి పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రతిరోజూ గంజాయి, డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడుతున్నారు. ఆరు మాసాల్లోనే గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు వంద వరకు నమోదయ్యాయి. ముఖ్యంగా ఔటర్‌రింగ్‌రోడ్డు ప్రాంతంపై పోలీస్ నిఘా లేకపోవటం వలన గంజాయి వ్యాపారులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.
తాజాగా, విజయవాడ నుంచి సుమారు వెయ్యి కిలోల గంజాయిని తీసుకువస్తున్న ఓ వాహనాన్ని పెద్దఅంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద అదుపులోకి తీసుకున్నారు. పండ్ల పెట్టెల్లో గంజాయి ఉంచి రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో నార్కోటెక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఔటర్‌రింగ్‌రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున రిసార్ట్లు ఏర్పాటు చేశారు. వీటికి కూడా గంజాయి, డ్రగ్స్ వంటి సరఫరా ఔటర్‌రింగ్‌రోడ్డుపై నుంచే చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల మొయినాబాద్ మండల పరిధిలోని పలు రిసార్టుల్లో జరిగిన పార్టీల్లో సైతం గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రిసార్టులు, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట, తుక్కుగూడ, మొయినాబాద్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో రిసార్టులు వెలిసాయి. ఇందులో ప్రతిరోజూ అనేక రకాల పార్టీలు జరుగుతుండడంతో ఎక్కువగా యువత హాజరుకాగా, వారికి నిర్వాహకులు గంజాయి, డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఔటర్‌రింగ్‌రోడ్డు పై నుంచి వచ్చి ఆయా రిసార్ట్‌లకు వీటిని అందజేస్తున్నట్లు పోలీసుల సమాచారంలో వెల్లడైంది.
ఆరు నెలల్లో వంద కేసులు..
ఔటర్‌రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్, ఆదిబట్ల, హయత్‌నగర్, వనస్థలిపురం, ఆదిబట్ల, మొయినాబాద్, నార్సింగి వంటి పోలీస్స్టేషన్ల పరిధిలో గంజాయి, డ్రగ్స్ వినియోగంతో పాటు రవాణా చేస్తున్న వారిపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. ఆరు మాసాల్లో వందకుపైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఓఆర్ఆర్ పైన వచ్చే వాహనాలను తనిఖీ చేయగా గంజాయి నిల్వలు బయటపడుతున్నాయి. పోలీసులు ఓవైపు అణచివేతకు దిగుతున్నప్పటికీ మరోవైపు ఈ వ్యాపారం గుట్టుగా సాగుతున్నది.
శివారుల్లో యథేచ్ఛగా..
హైదరాబాద్ శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లా పరిధిలోని ఔటర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు మున్సిపాలిటీల్లో గంజాయి, డ్రగ్స్ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నది. ముఖ్యంగా పాన్సాపులు, కిరాణా షాపులు, బెల్టుషాపుల్లో కూడా వీటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. మరోవైపు శివారు ప్రాంతాల్లో ఇంజినీరింగ్ విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని, గంజాయి సరఫరా చేస్తున్న పలువురిపై ఇటీవల ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట్ పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదవుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాలకు పాకిన మత్తు..
ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన గంజాయి, డ్రగ్స్ వ్యాపారం గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. గంజాయి మత్తులో ఘర్షణలతో పాటు అనేక అసాంఘిక కార్యక్రమాలకు కూడా యువత ఆకర్షితులవుతున్నారు. ఇటీవల యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంతన్‌గౌరెల్లి గ్రామంలో ఓ వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడు కూడా గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లోని బెల్టు, కిరాణా షాపుల్లో సైతం వీటి విక్రయాలు సాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ వ్యాపారాన్ని అరికట్టడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఇది మరింత విస్తరించే అవకాశాలున్నాయని ప్రజలు వాపోతున్నారు.