రంగారెడ్డి, ఏప్రిల్ 4 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో గంజాయి విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యువతే టార్గెట్‌గా నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలు సాగుతున్నాయి. జిల్లాలోని శివారు ప్రాంతాలు వీటికి అడ్డాగా మారాయి. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా దొరుకుతున్నాయి. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా నియంత్రించలేకపోతున్నారు. దీంతో యువకుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో వైన్‌షాపులు, చాయ్ హోటళ్లలో ఎక్కువగా విక్రయిస్తున్నారు.
మహేశ్వరం, ఎల్బీనగర్ డివిజన్ల పరిధిలో ఎస్వోటీ ఆధ్వర్యంలో విస్తృత దాడులు జరుగుతున్నా వీటి అమ్మకాలు ఆగడం లేదు. పోలీసులు జరుపుతున్న దాడుల్లో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట గంజాయి వ్యాపారులు పట్టుబడుతూనే ఉన్నారు. హైదరాబాద్ -నాగార్జునసాగర్ రహదారిలోని బీఎన్‌రెడ్డి నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు, హైదరాబాద్ నుంచి చేవెళ్ల వరకు ఎక్కువ సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. కళాశాలల విద్యార్థుల కోసం హాస్టళ్లు ఏర్పాటు చేశారు. వీటిని అడ్డాగా చేసుకొని కొందరు యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డిజిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, వనస్థలిపుం, ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, రాజేంద్రనగర్ తదితర పోలీసుస్టేషన్లల్లో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి అక్రమ వ్యాపారానికి…. వ్యాపారస్తులు ఓఆర్ఆర్ను అడ్డాగా మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని కార్లు, ఇతరత్రా వాహనాల్లో తీసుకొచ్చి ఓఆర్ఆర్ మీదుగా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవల ఓఆర్ఆర్పై పది నుంచి పదిహేను వాహనాలను తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి వ్యాపారులకు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను టార్గెట్‌గా పెట్టుకుని ఈ వ్యాపారాన్ని యథేచ్ఛగా
సాగిస్తున్నారు.
ఇటీవల కందుకూరు, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో జరిగిన పలు దొంగతనాల్లో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు బెట్టింగ్‌లకు పాల్పడినవారు పట్టుబడటం విశేషం. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని అప్పులు తీర్చేందుకు విద్యార్థులు గంజాయి మత్తులో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఇటీవల సాగర్హ్రదారి నుంచి పెద్దఅంబర్‌పేట్‌కు వెల్లిన దారిలో జరిగిన పలు దారి దోపిడీలను పోలీసులు గంజాయి మత్తులోనే జరిగినవిగా పోలీసులు గుర్తించారు. తాజాగా… నగరశివారులోని మందమల్లమ్మ ఫంక్షన్ హాల్ నుంచి జర్మనీ యువతిని తీసుకెల్లి అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుల్లో కూడా గంజాయి బ్యాచ్ ఉన్నట్లు తెలిసింది. గంజాయికి అలవాటు పడ్డ అనేకమంది వారి భవిష్యత్తును అంధకారం చేసు
కుంటున్నారు.
గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన గంజాయి తదితర మత్తు పదార్థాలు గ్రామీణ ప్రాంతాలకు పాకింది. గ్రామాల్లో యువకులు గంజాయి మత్తుకు చిత్తవుతున్నారు. గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇటీవల మారుమూల దండమైలారంలో కూడా గంజాయి మత్తులో యువకులు ఘర్షణలకు పాల్పడ్డారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పల్లి ఎక్స్‌రోడ్డు వద్ద గంజాయి మత్తుకు బానిసైన యువకుడు ఏకంగా ఇంజినీరింగ్ విద్యార్థినిపైనే లైంగికదాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కళాశాల హాస్టల్లో ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థినిపై హాస్టల్ భవన యాజమాని కారు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు ఏకంగా ఆ యువకుడిని కటకటాలకు పంపించి.. హాస్టల్ భవనాన్ని సీజ్ చేశారు. ఇటీవల తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో ఓ యువకుడు గంజాయికి అలవాటుపడి చెడుదారిలో వెళ్తుండడంతో మందలించిన తండ్రిని ఏకంగా ఆ యువకుడు హత్య చేశాడు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. శివారు ప్రాంతాల్లో యువత, విద్యార్థులు మత్తుకు బానిసై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఎక్కడైనా గంజాయి సరఫరా జరిగినట్లు తెలిస్తే తమకు సమాచారమివ్వండి.
– కేపీవీ రాజు, ఏసీపీ ఇబ్రహీంపట్నం
గంజాయి మత్తులో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మత్తులో ఏం చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గంజాయి సేవించడంతో మత్తు దిగని పరిస్థితి. గంజాయి అక్రమ రవాణాను అరికట్టి…మత్తుకు బాసిన అవుతున్న యువతపై చర్యలు తీసుకోవాలి.
– అబ్బయ్య, సైకాలజిస్టు