జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న పలు చెరువుల సంరక్షణ, సుందరీకరణకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. రేవంత్ సర్కార్ అధికా రంలోకి రావడంతో తటాకాల బ్యూటిఫికేషన్, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం, చెరువుల హద్దుల గుర్తింపు వంటి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. టెండర్లు పూర్తైన పనులనూ చేపట్టకుండా వదిలేశారు. దీంతో పలు చెరువులు కబ్జాలకు గురై తమ ఉనికిని కోల్పోతున్నాయి.
-రంగారెడ్డి, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ)
కోట్లాది రూపాయల నిధులు..
జిల్లాలోని నగర శివారులో విస్తరించి ఉన్న పలు చెరువులను గత బీఆర్ ఎస్ ప్రభుత్వం మొదటి విడత సుందరీకరణ పనులకు ఎంపిక చేసి నిధు లు విడుదల చేసింది. వాటిలో ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు రూ. 18 కోట్లు, తుర్కయాంజాల్ మాసబ్చెరువుకు రూ. 8 కోట్లు, మీర్‌పేట పెద్దచెరువుకు రూ. 4 కోట్లు, అల్మాస్గూడ కోమటికుంటకు రూ. 2 కోట్లు, పోచమ్మకుంటకు రూ. కోటి, జల్పల్లి పెద్దచెరువుకు రూ. 3 కోట్లు, రావిర్యాల పెద్ద చెరువుకు రూ.4 కోట్లు కేటాయించింది. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు కట్టను వెడల్పు చేయడంతోపాటు పర్యాటకులను ఆకట్టుకునేలా చెరువుకట్టపై పూల మొక్కల పెంపకం, వాకర్ పార్కు, చెరువులో బోటింగ్ , రిసార్ట్‌ల నిర్మాణానికి రూ. 18 కోట్లను కేటాయించింది. ఈ నిధులకు సంబంధించి హెచ్ఎండీఏ టెండర్లను కూడా పూర్తి చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. ప్రభుత్వం మారడంతో ఇప్పటివరకు చెరువు సుం దరీకరణకు సంబంధించి ఏ ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. అలాగే, మీర్‌పేట, అల్మాస్గూడ, జల్పల్లి, రావిర్యాల వంటి చెరువుల వద్ద చేపట్టి న పనులనూ అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆ పనులపై హెచ్ఎండీఏ అధికారులు దృష్టి సారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చెరువులు.. కబ్జాల పరం
జిల్లాలోని చెరువులు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కబ్జాలకు చెక్ పెడుతున్నారు. గత ప్రభు త్వం ఆక్రమణలకు ఆస్కారం ఇవ్వొద్దన్న ఉద్దేశంతో చెరువుల సుం దరీకర ణతోపాటు చెరువుల చుట్టూ జాలి కంచె వేసింది. అయితే బ్యూటిఫికేషన్ పనులు నిలిచిపోవడంతో శివారు ప్రాంతాల్లోని చెరువులు పెద్ద ఎత్తున కబ్జాలపరం అవుతున్నాయి. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్చెరువు విస్తీర్ణం సుమారు 600 ఎకరాల వరకు ఉంటుంది. చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం 300 ఎకరాల వరకు కుంచించుకుపోయింది. రావిరాల పెద్దచెరువులో బ్యూటిఫికేషన్ పనులు ప్రారంభించినా అవికూడా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం చెరువులను పట్టించుకోకపోవడంతో శివారుల్లోని చెరువులు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. ఇటీవల, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుంట్లూరు చెరువు, తుర్కయాంజాల్ మాసబ్‌చెరువు, ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోని ఆక్రమణలను గుర్తించారు.
చెరువులు కబ్జా అవుతున్నాయి..
కేసీఆర్ ప్రభుత్వం చెరువుల సుందరీకరణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. బీఆర్ఎస్ హయాంలో చెరువుల బ్యూటిఫికేషన్ పనులు కొనసాగినప్పటికీ.. తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పనులను పూర్తిగా నిలిపేసింది. దీంతో పలు చెరువులు కబ్జాలకు గురవుతు న్నాయి. చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా ఉండేందుకు వెంటనే సుందరీకరణ పనులను చేపట్టాలి.
-సత్తు వెంకటరమణారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్
సుందరీకరణ చేపట్టాలి..
చెరువుల సుందరీకరణకు గత ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. పలుచోట్ల సుందరీకరణ పనులు 50 శాతం వరకు పూర్తైనా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను కొనసాగించకపోవడం విడ్డూరం. చెరువులను సుందరీకరిస్తే ప్రజలకు మేలు జరగడంతోపాటు పర్యాటకుల తాకిడి కూడా పెరుగుతుంది. రేవంత్ సర్కార్ ఆ పనులపై దృష్టి సారించాలి.
– మైలారం విజయ్‌కుమార్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి