Vikarabad | వికారాబాద్, ఏప్రిల్ 19 : గత రెండు,మూడు రోజులుగా భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో వికారాబాద్ మండలంలోని ఆయా గ్రామాల రైతులకు చెందిన మామిడి, కూరగాయల పంటలు పాడైపోయాయి. వికారాబాద్ మండల పరిధిలోని మదన్‌పల్లి, మైలార్‌దేవరంపల్లి, గెరిగెట్పల్లి, నారాయణపూర్, పెండ్లిమడుగు, సిద్దులూర్, పాతూర్, కొటాలగూడ తదితర గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. అదే విధంగా కూరగాయల పంటలు సైతం పాడైపోయాయి.
మండలంలో సుమారు 70 ఎకరాల్లో మామిడి, 20 ఎకరాల్లో కూరగాయల పంటలు పాడైపోవడంతో దాదాపు 30 మంది రైతులకు ఆర్థిక నష్టం జరిగింది. అప్పులు చేసి పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు ఈదురు గాలులు మరింత నష్టాన్ని మిగిల్చాయి. పలు చోట్ల మామిడితోటల్లో చెట్టు కొమ్మలు సైతం విరిగి పోయాయి. దీంతో పంటలు పాడై సుమారు రూ.40 లక్షల వరకు నష్టపోవడం జరిగిందని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న వ్యవసాయ, ఉధ్యాన వనశాఖ అధికారులు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించారు. దాదాపు 40 ఎకరాల్లో సాగు చేస్తున్న 10 మంది మామిడి రైతులకు 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగింది. 10 ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తున్న 7 మంది రైతులకు 33 శాతం కంటే ఎక్కువగా నష్టపోయారని అధికారులు తెలిపారు. పంట నష్టం సుమారుగా రూ. 36 లక్షల వరకు ఉంటుందన్నారు. నష్టపోయిన పంటల విరవాలను నమోదు చేసుకొని జిల్లా కలెక్టర్‌కు నివేదించడం జరుగుతుందని తెలిపారు. 33 శాతం కంటే తక్కువగా పంటలు పాడైన వారికి సైతం నష్టపరిహారం అందజేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.