యాచారం, మార్చి 23 : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పారిశ్రామికవాడకు భూములిచ్చేది లేదని మండలంలోని మొండిగౌరెల్లి గ్రామస్తులు మరోసారి తేల్చిచెప్పారు. శనివారం రాత్రి గ్రామంలో రైతులంతా కలిసి నాయకులు అంజయ్యయాదవ్, తాండ్ర రవీందర్, మేకల యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ప్రభుత్వం గ్రామంలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక వాడ కోసం భూములను ఇవ్వొద్దని ప్రతిజ్ఞ చేశారు. భూముల సేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాడుదామని తీర్మానించారు.
గ్రామంలో భూముల సర్వే చేపడితే సమష్టిగా అడ్డుకుందామని.. బలవంతంగా భూ సేకరణకు పాల్పడితే అవసరమైతే లగచర్ల మాదిరిగా అధికారులను గ్రామం నుంచి తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని అంజయ్యయాదవ్, రవీందర్, యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. భూములను కాపాడుకునేందుకు ఎలాంటి ఆందోళనలు, ఉద్యమాలు చేపట్టినా రైతులంతా స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. సాగు చేసుకునే భూముల్లో పరిశ్రమల ఏర్పాటు చేయడమేంటని వారు ప్రశ్నించారు.
గ్రామంలో పారిశ్రామిక వాడ కోసం 821.11 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని..దానిని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల భూ ముల జోలికొస్తే ఊరుకునేదిలేదన్నారు. కేసులు, జైళ్లకు భయపడేదిలేదని హెచ్చరించారు. రైతుల మేలు కోరి ప్రభుత్వం వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలని, లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు, యువకులు, గ్రామస్తులు ఉన్నారు.