ఇబ్రహీంపట్నం రూరల్, నవంబర్ 10 : అధికారంలోకి రాకముందు అలవి కాని హామీలిచ్చి.. పవర్లోకి రాగానే అన్ని వర్గాలతోపాటు రైతన్న జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ, మలిశెట్టిగూడ గ్రామాల్లోని రైతన్నలు ధాన్యాన్ని కోసి కల్లాల్లోనే నిల్వ చేయగా వాటిని పరిశీలించి మాట్లాడారు. గత కేసీఆర్ హయాంలో సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కొనుగోళ్లు ప్రారంభించకుంటే సోమవారం రైతులతో కలిసి ఉద్యమిస్తామన్న ప్రకటనతో దిగొచ్చిన పౌరసరఫరా శాఖ అధికారులు సోమవారం నుంచి కచ్చితంగా కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చా రని.. అప్పటికీ కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రాకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
కరోనా కష్టకాలంలోనూ రైతులు ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకున్నదన్నారు. రైతుబంధు ఎగ్గొట్టి, సగం మందికే రుణమాఫీ చేసి, రైతుబీమాను కాంగ్రెస్ సర్కారు మరిచిపోయిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రాకపోవడంతో రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోతున్నారని.. దిగుబడి సరిగ్గా రాక, తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక వారు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సన్నవడ్లకు ఎలాంటి కొర్రీల్లేకుండా రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, రైతుబంధు సమితి మాజీ మండలాధ్యక్షుడు అంజిరెడ్డి, సహకార సంఘం మాజీ చైర్మన్ క్యామ శంకర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్, గణేశ్, మల్లేశ్, శ్రీశైలం, శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్, రైతులు, పాల్గొన్నారు.
కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే..
దేవుడిలాంటి కేసీఆర్ లేక చాలా ఇబ్బంది అవుతున్నది. ఆ సార్ ఉన్నప్పుడు సమయానికి రైతుబంధు డబ్బులొచ్చేవి. పంట కోతలు మొదలు కాగానే కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చేవి. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి అందరికీ ఇబ్బందులు మొదలయ్యాయి. వరిని కోసి 20 రోజులవుతున్నా.. ఇప్పటికీ కొంటనేలేరు. మళ్లీ కేసీఆర్ సార్ వస్తేనే అన్నదాతలకు ఇబ్బందులు తప్పుతాయి.
– ఆండాళు, మహిళారైతు మలిశెట్టిగూడ..
వెంటనే ధాన్యాన్ని కొనాలి..
వరికోసి 20 రోజులవుతున్నది. పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్తే కొన్ని రోజులు ఆగాలని చెబుతున్నారు. వర్షం వస్తే పంట మొత్తం నానిపోతుంది. పంటను నిల్వ చేసేందుకు స్థలం కూడా లేదు. కాంగ్రెస్ సర్కార్ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. వెంటనే ధాన్యాన్ని కొనాలి.
-సుదర్శన్‌రెడ్డి, రైతు శేరిగూడ