రంగారెడ్డి, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా జీర్ణించుకోలేని ఎమ్మెల్యే రంగారెడ్డి ఎక్స్అఫీషియో ఓటును అడ్డం పెట్టుకుని చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక జరుగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్కు 15 మంది కౌన్సిలర్ల మద్దతున్నా .. కాంగ్రెస్‌పార్టీ అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నికను వాయిదా వేయించిందన్నారు. అలాగే, ఆమనగల్లు మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్కు తగిన సంఖ్యాబలమున్నా కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర కలయికతోపాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్‌ను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకుని..అడ్డదారిలో చైర్మన్ పదవిని హస్తగతం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మొయినాబాద్ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్‌పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్‌ను కిడ్నాప్‌చేసి.. అలాగే బీజేపీ నుంచి గెలుపొందిన రెబెల్ అభ్యర్థులను తమవైపు తిప్పుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు.