రంగారెడ్డి, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వ్యవహార శైలి సొమ్ము ఒకరిది…సోకు మరొకరిదిలా మారిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇబ్రహీంప ట్నం సెగ్మెంట్లో గత బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులను తాను మంజూరు చేయించానని చెప్పుకొంటూ శంకుస్థాపనలు చేస్తున్నారని.. ఆయనకు దమ్ముంటే శంకుస్థాపనలు చేసిన పనులకు సంబంధించిన జీవోలను బయటపెట్టాలని సవాల్ విసిరారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ప్రజల ఓట్లను పొందేందుకే గత కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.200 కోట్లను తాను తీసుకొచ్చినట్లు గొప్పలు చెప్పుకొంటున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో తాను వేసిన శిలాఫలకాలను తొలగించి ఇప్పటివరకు 182 మళ్లీ శిలాఫలకాలు వేశారని, వాటిని తొలగించే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడుతామన్నారు. అంబేద్కర్చౌరస్తా నుంచి ఆక్టోపస్ వరకు రోడ్డు విస్తరణ పనులకు గత బీఆర్ఎస్ ప్ర భుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసిందని, ఆ నిధులతో రోడ్డు వెడల్పు చేపట్టే పనులను ప్రస్తుత ఎమ్మెల్యే రంగారెడ్డి ఇండ్లు కోల్పోతున్న వారితో కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకున్నారని.. ఇప్పుడు ఆ నిధులను తానే తెచ్చినట్లు చెప్పుకొంటున్నారని విమర్శించా రు.
ఇబ్రహీంపట్నంలో కొత్తగా ఏర్పడిన పలు కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు వంటి పనుల కోసం గత కేసీఆర్ ప్రభుత్వం రూ.104 కోట్లను మంజూరు చేసిందని, ఆ నిధులతో పనులను కూడా ప్రారంభించామని.. ప్రభుత్వం మారడంతో ఆ డబ్బుతోనే ఎమ్మెల్యే రంగారెడ్డి కొత్తగా శంకుస్థాపనలు, శిలాఫలకాలు వేశారన్నారు.
ఇబ్రహీంపట్నంలో 30 పడకల ఆస్పత్రిని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 100 పడకల ఆస్పత్రిగా మార్చి.. రూ.37 కోట్లు మంజూరు చేసిందని ఆ నిధులకు సంబంధించి శంకుస్థాపనలు కూడా చేశామని, మళ్లీ ఆ నిధులను తానే తెచ్చినట్లు చెప్పుకొని కొత్తగా శిలాఫలకాలు వేశారని ఎద్దేవా చేశారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణకోసం గత ప్రభుత్వం రూ.9 కోట్లు మంజూరు చేయగా.. పనులనూ తాము ప్రారంభించామని.. మళ్లీ ఆ పనులకే శంకుస్థాపనలు చేశారన్నారు.
తొర్రూరు-ఇంజాపూర్ గ్రా మాల మధ్య రోడ్డు మరమ్మతుకు రూ.24 కోట్లు, మునుగనూరు రోడ్డుకు రూ.20 కోట్లు గత ప్రభుత్వం కేటాయించిందని.. యాచారం నుంచి మీర్ఖాన్పేట్ వరకు రోడ్డు విస్తరణకు నిధులు మంజూరైనా అక్కడ ప్రస్తుతం ఎన్నికలు లేవన్న సాకుతో ఆ పనులను నిలిపేశారని ఆరోపించారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇబ్రహీంపట్నం మున్సిపల్ ప్రజల దృష్టిని మళ్లించాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే రంగారెడ్డి శంకుస్థాపనలు, శిలాఫలకాలు చేస్తున్నారని మా జీ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎమ్మెల్యే రంగారెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లు, రియల్ఎస్టేట్ వ్యాపారులు, వివిధ విద్యాసంస్థల యజమానులను బెదిరిస్తున్నారని ఆయన ఆగడాలకు అడ్డుకునేందుకు త్వరలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.