రంగారెడ్డి, ఏప్రిల్ 13 : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే చేవెళ్ల, షాద్నగర్ సెగ్మెంట్లలో పూర్తయ్యాయి. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు. అలాగే, నేటి నుంచి నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీ సమావేశాలతోపాటు మండలాలు, మున్సిపాలిటీల అధ్యక్ష, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. జిల్లాలోని 16 మున్సిపాలిటీలు, రెండు నగర పాలక సంస్థలు, 21 మండలాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు రజతోత్సవానికి స్వచ్ఛందంగా తరలివెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇందుకోసం జిల్లా నుంచి 317 ఆర్టీసీ బస్సులు, 20 ప్రైవేట్ బస్సులు, సుమారు 700 కార్లను అందుబాటులో ఉంచుతున్నా రు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి 75 ఆర్టీసీ, 20 ప్రైవేటు బస్సులు, 160 కార్లు, ఎల్బీనగర్ నుంచి 72 బస్సులు, 220 కార్లు, రాజేంద్రనగర్ నుంచి 55 ఆర్టీ సీ బస్సులు, 100 కార్లు, మహేశ్వరం నుం చి 83 బస్సులు, 100 కార్లు, చేవెళ్ల నియోజకవర్గం నుంచి 62బస్సులు, 100 కార్లను సిద్ధంగా ఉంచనున్నారు. ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున బహిరంగ సభకు తరలివస్తారని భావిస్తున్న నేపథ్యంలో.. పై మూడు సెగ్మెంట్లలో ఇప్పటికే కార్యకర్తల సమావేశాలు నిర్వహించి బహిరంగసభకు హాజరుకావాల్సిన ఆవశ్యకతపై దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తుండడంతో గులాబీ దళంలో కొత్త జోష్ కనిపిస్తున్నది. ఇప్పటికే చేవెళ్ల, షాద్నగర్ సెగ్మెంట్లలో సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియో జకవర్గాల్లోనూ సమావేశాలను నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రారంభమైనది. ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని కూడా సక్రమంగా నెరవేర్చకపోవడంతో అన్ని వర్గాల వారు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ అనంతరం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుంది. వరంగల్ సభకు గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, కార్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు