నిర్వాహకులు ధాన్యాన్ని దర్జాగా దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా తూకాలు వేస్తూ అన్నదాత జీవితాలతో ఆడుకుంటున్నారు. వారు చెప్పింది వింటే ఏ కొర్రీ లేకుండా ధాన్యం తూకం చేసి పంపిస్తున్నారు. లేదంటే ముప్పు తిప్పలు తప్పవు. ఎవరికైనా చెబితే ధాన్యం కొనుగోలు చేయరేమోనని ఆందోళనలో ఉన్నాడు అన్నదాత. ప్రస్తుతం మండలంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థతి నెలకొన్నది.
-బషీరాబాద్, జూన్ 3
దళారుల చేతుల్లో రైతన్న మోసపోకుండా ఉండేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతి రైతు నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిం చి రైతన్న కండ్లలో ఆనందాన్ని నింపింది. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాలు దళారులను తలదన్నేలా మారాయి.
మండలంలోని కాశీంపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రంలో నిత్యం ఎదో ఒక లొల్లి జరుగుతున్నది. నిర్వాహకు లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ధాన్యాన్ని విక్రయించిన ఓ రైతు బిల్లు చేసేందుకు నిర్వాహకులు డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఓ రైతుకు చెందిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొని.. ఎక్కువ ధరకు విక్రయించినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకోకుండా నిర్వాహకులు బస్తాకు 42 కిలోల 500 గ్రాముల చొప్పున, క్వింటాకు 4 నుంచి 5 కిలో ల ధాన్యాన్ని ఎక్కువ తూకం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతం 17 వచ్చి నా బస్తాకు 42 కిలోల 500 గ్రాములు ఎక్కువగా తూకం చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు.
అడ్డగోలుగా తూకం చేస్తూ నిలువునా ముంచుతున్నారని, గట్టిగా ప్రశ్నిస్తే మిల్లర్లు మీ ధాన్యాన్ని తీసుకోరని భయపడుతున్నారని అన్నదాతలు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఓ రైతుకు చెందిన 800 బస్తాలు తూకం చేస్తే 800 బస్తాలకు 42 కిలోల 500 గ్రాముల చొప్పున లెక్క కడితే 34 టన్నులు అవుతుంది. అయితే నిర్వాహకులు లారీ లోడింగ్ చేసి రైస్‌మిల్లులకు పంపించేటప్పుడు 800 బస్తాలకు బదులు 771 బస్తాలను మాత్రమే లోడ్ చేస్తున్నారని, 41 కిలోల చొప్పున లెక్కిస్తే 771 బస్తాలే అవుతున్నాయ ని రైతులు పేర్కొంటున్నారు. మిగతా 29 బస్తాల ధాన్యాన్ని తక్కువగా లెక్కిస్తూ నిర్వాహకులు నిలువునా మోసం చేస్తున్నారని పలువురు రైతులు పేర్కొంటున్నారు. కేవలం ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని ఇప్పటివరకు కాశీంపూర్ కొనుగోలు కేం ద్రం ద్వారా 25,000 బస్తాల వరకు ధాన్యాన్ని సేకరించారని.. ఆ లెక్కన పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్లు మండిపడుతున్నారు.
తేమ శాతం 17 కంటే తక్కువ వచ్చింది..అయినా బస్తాకు 42 కిలోల 500 గ్రాముల చొప్పున తూకం చేశారు. ఇలా ఎందుకు చేస్తున్నారని నిర్వాహకులను ప్రశ్నిస్తే మాకు మిల్లర్లు చెప్పారు మేము అలాగే తూకం చేస్తున్నామని బదులిచ్చారు.
-జగనాథ్‌రెడ్డి, రైతు మంతట్టి
41 కిలోల చొప్పున తూకం చేయాలని నిర్వాహకులకు మా సిబ్బంది చెప్పినా వినడం లేదు. రైతుల వద్ద ఎక్కువ తూకం చేసి వారిక నష్టం కలిగించొద్దని కేంద్రాన్ని సందర్శించినప్పుడు సూ చించా. అయినా వారు ఏ ధైర్యంతో చేస్తున్నారో మాకు తెలియదు.
– పద్మారావు, ఏపీఎం
రైతుకు విలువ లేదు. అన్నదాతను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను నిర్వాహకులు చెప్పినట్లు విని విక్రయించాల్సి వస్తున్నది. వారితో వాదిస్తే కొర్రీలు పెట్టి ధాన్యాన్ని సేకరించారని భయపడి.. అమ్ముకోవాల్సి వస్తున్నది.
-రవి, రైతు, కాశీంపూర్