శంషాబాద్ రూరల్, జూలై 11: శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad) రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్పోర్ట్ స్టేషన్ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం వీఏఆర్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది తమ విధులను ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొన్న బస్సు.. ఆటోను వెనుక నుంచింది. దీంతో లక్ష్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. హన్మంతు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రమాద సమయంలో ఆటోలో 13 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.
మృతుడు లక్ష్మయ్య (50) నల్లగొండ జిల్లా మంగళ్ తాండా, కంబాలపల్లికు చెందిన వారని, హన్మంతు (29) మహబూబ్ నగర్ జిల్లా ఉడిమియాలకు చెందినవారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.