గట్టుప్పల్, మార్చి 16 : ఉపాధి హామీలో ముఖం ఆధారిత ఫొటోతో సంబంధం లేకుండా హాజరు వేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో జరుగుతున్న గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఉపాధి హామీ చట్టం లేకుండా చేయాలని దురుద్దేశంతో అనేక సవరణలు చేస్తూ చట్ట ఉద్దేశానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బడ్జెట్లో నిధులను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో చట్టాన్ని కొనసాగించాలని, చట్టం పేరు మార్పు చేసి అనేక సవరణలు చేయడం వల్ల పొమ్మనకుండానే పొగబెట్టినట్టుగా కూలీలను చట్టానికి దూరం చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా కొత్త బిల్లు తేవడం జరిగిందన్నారు. దీని ఫలితంగా ఉపాధి హామీ భవిష్యత్లో ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పడవుగా ఉన్న భూములన్నీ సేద్యంలోకి వచ్చాయని, ఫలితంగా పేద రైతుల ఆర్థిక వెసులుబాటు పెరిగిందని, కూలీలకు కూలి రేట్లు కూడా పెరగడం జరిగిందని, దీని ఫలితంగా పేదల బ్రతుకుల్లో కొంత మనోధైర్యం పెరిగిందన్నారు. ఉపాధి హామీని యధా విధిగా కొనసాగించి విబిజీ రామ్ జీ బిల్లును రద్దు చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలంటే కేంద్ర బడ్జెట్ లో రూ.2.5 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి ఉపాధి హామీలో పనిచేస్తున్న సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేసి వారి వేతనాలు పెంచి నెలనెలా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని తద్వారా ఉపాధి హామీ చట్టం సక్రమంగా అమలు కావడానికి అవకాశాలు ఉంటాయన్నారు. ఉపాధి హామీలో మేట్ల వ్యవస్థను పునరుద్దించాలని, సమ్మర్ అలవెన్స్ కొనసాగించాలని, కూలీలందరికీ పనిముట్లు ఇవ్వాలని, నూతనంగా దరఖాస్తు చేసుకున్న కార్మికులకు జాబ్ కార్డులు ఇవ్వాలని, పనిచేసే చోట వాటర్, టెంట్, మెడికల్ కిట్టు సౌకర్యాలు కల్పించాలని అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలి రూ.800, బార్య భర్తలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని, సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఆత్మీయ భరోసా పేరుతో వ్యవసాయ కార్మికులకు ప్రతి కుటుంబానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడిచినా అమలు నోచుకోలేదని, వెంటనే ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలన్నారు. అలాగే కేరళ రాష్ట్ర ప్రభుత్వం తరహాలు 50 ఏళ్లు నిండిన వ్యవసాయ కార్మికులందరికీ రూ.5 వేల వ్యవసాయ కార్మిక పెన్షన్ ఇవ్వాలన్నారు. చట్ట రక్షణ, కార్మికుల హక్కుల కోసం ఈ నెల 24న ఢిల్లీలో జరిగే ఆందోళన కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండా శ్రీశైలం, వ్యవసాయ కార్మిక సంఘం గట్టుప్పల మండల కార్యదర్శి కర్నాటి సుధాకర్, గ్రామ అధ్యక్షుడు పెద్దగోని అండాలు, ఉపాధ్యక్షులు భీమగోని భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నీలా స్వప్న, సహయ కార్యదర్శి ఎండి రహీం, కోశాధికారి సిలివేరు స్వాతి, ఉపాధి కూలీల సంఘం గ్రామ నాయకులు నల్లవెల్లి వెంకటయ్య, పగిళ్ల రేణుక, సిలువేరు అంజయ్య, బోయపల్లి లలిత, పెద్దగాని రేణుక, నీలా భ్రమరాంబ, నల్లవెల్లి యాదమ్మ, తిరందాసు సుగుణ, పగిళ్ల రేణుక, వాయిల్ల విజయ, కుండే పద్మ, పెద్దగోని సూర్యకళ, బీమగోని కవిత పాల్గొన్నారు.