హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంలో అనిశ్చితి నెలకొన్నది. వర్షాలతో కొన్ని చెరువులు, రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్న తరుణంలో మత్స్యకారులకు సకాలంలో చేప పిల్లలను అందించాల్సిన మత్స్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. టెండర్ల దాఖలుకు సోమవారంతో గడువు ముగిసినప్పటికీ కాంట్రాక్టర్ల నుంచి ఎటువంటి స్పందl రాలేదు.
దీంతో ఈసారి ఉచిత చేప పిల్లల పంపిణీ సాగుతుందా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో చేపపిల్లలను సరఫరా చేసిన ప్రైవేటు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి సుమారు రూ.120 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. పాత బకాయిలన్నీ చెల్లిస్తే తప్ప కొత్త టెండర్లలో పాల్గొనేది లేదని కాంట్రాక్టర్లు తేల్చిచెబుతుండటంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.