నల్లగొండ రూరల్, మార్చి 16 : పెండింగ్‌లో ఉన్న మెస్ చార్జీలన్నింటినీ విడుదల చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా విడుదల చేయాల్సినటువంటి మెస్ చార్జీలను ఎనిమిది నెలలకు ఒకసారి విడుదల చేయడం చాలా బాధాకరమన్నారు. బీసీ వసతి గృహ సంక్షేమ అధికారులు అప్పులు చేసి మరీ హాస్టల్స్‌ను నడపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దే విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను వదిలిపెట్టి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టేకోలు దీపేందర్, శివ, మహేశ్ యాదవ్, అనిల్, విక్రం, రాజు, సునీల్ కుమార్, క్రాంతి పాల్గొన్నారు.