బడంగ్పేట్, మే 13 : కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితారెడ్డి సవాల్ విసిరారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించారన్నారు. ప్రజలకున్న ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లోకి వెళ్లి సమాధానం చెప్పే దమ్మూ ధైర్యం లేదన్నారు. ధైర్యం లేకనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేస్తూ వస్తున్నారన్నారు. ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక భరోసా అందించామన్నారు. మహిళల జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేశామన్నారు. ఇప్పటికీ ప్రజల సంక్షేమమే మా ప్రథమ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. మహిళలకు ఇస్తామన్న 25వేల రూపాయలు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ కిట్లు కూడా రాకుండా చేశారని ఆమె ఆరోపించారు. కార్యక్రమంలో బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి, జల్పల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్, మాజీ చైర్మన్ అబ్దుల్, మాజీ కౌన్సిలర్లు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.