రూ.2 లక్షల రుణ మాఫీ రైతులకు గుదిబండగా మారింది. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది..’ అన్న చందంలా ఉన్నది.. రూ.2లక్షల వరకే మాఫీ వర్తిస్తున్నందున.. ఆపైన ఉన్న రుణాన్ని చెల్లిస్తేనే మాఫీ అవుతుందని ప్రభుత్వం చెబుతున్నది. దీంతో రూ.2లక్షలకు మించి రుణాలు ఉన్న రైతులు అప్పుల బాట పడుతున్నారు. సాగు పెట్టుబడికే అప్పులు దొరకక చస్తుంటే.. మళ్లీ తీసుకున్న రుణం చెల్లించేందుకు అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొస్తున్న జిల్లా రైతాంగం అప్పులు ఊబిలోకి కూరుకుపోతున్నది. ఇదేమి రుణమాఫీ దేవుడా అంటూ రైతాంగం ఆవేదనకు గురవుతున్నది.
అదనపు మొత్తం కట్టేదెలా..!
ఎలాంటి నిబంధనలు లేకుండా రూ.2లక్షలు రుణమాఫీ అమలు చేస్తారని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురైంది. ప్రభుత్వం విధించిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. బ్యాంకుల్లో ఎంత రుణం ఉన్నప్పటికీ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీని అమలు చేస్తే.. వెసులుబాటు ఉన్న సమయంలో మిగిలిన మొత్తాన్ని చెల్లించి రుణ విముక్తులు అయ్యేవారమని రైతులు పేర్కొంటున్నారు. రూ.2లక్షలకు పైన ఉన్న మొత్తాన్ని చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుందని నిబంధన విధించడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు.
అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు రైతులు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం పెట్టుబడులకే చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్న రైతులకు అధిక వడ్డీకి మరోమారు అప్పు చేయాల్సి వస్తున్నది. ఇదిలా ఉండగా.. బ్యాంకులు ఇప్పటి వరకు రుణమాఫీ అయిన రైతులకు వానకాలం పంట రుణాలు ఇస్తున్నాయి. కానీ మాఫీ జరుగని రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. దీంతో వ్యవసాయ సీజన్లో రుణాలు దొరకక వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొన్నదని అన్నదాతలు వాపోతున్నారు. రుణమాఫీతో ప్రభుత్వ గ్రాఫ్ పెరుగకపోగా.. తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. రుణమాఫీ ప్రభుత్వానికి నష్టదాయకమే తప్ప ఏ మాత్రం లబ్ధి చేకూర్చేలా లేదని గ్రామాల్లోని కాంగ్రెస్ శ్రేణులు బాహాటంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
తలపట్టుకుంటున్న అధికారులు..
రుణమాఫీ కాని రైతులు నిత్యం బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదులు సైతం పెద్ద ఎత్తున అధికారులకు అందుతున్నాయి. మండలాల వారీగా ఫిర్యాదుల నమోదు, పరిష్కారానికి ప్రత్యేక అధికారులను జిల్లా వ్యవసాయ శాఖ నియమించింది. ఇప్పటి వరకు చేసిన ఫిర్యాదులకు పరిష్కారం లభించకపోవడంతో మళ్లీ ఫిర్యాదు చేసినా ఏం ప్రయోజనమని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వద్దకు వెళ్తే.. ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపించి వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఓ వైపు.. రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి మరోవైపు.. ఏం చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రైతులకు రుణమాఫీ జరుగకపోవడానికి కారణమేంటో? ఏ ప్రాతిపదికన అర్హులను నిర్ధారించారో! ఏ ప్రామాణికంగా అనర్హులను తేల్చారో? తమకు కూడా అంతుపట్టడం లేదని వారు పేర్కొంటున్నారు.
పైడబ్బులు కడితేనే మాఫీ అంటున్నరు..
నాకు మూడు ఎకరాల పొలం ఉన్నది. కెనరా బ్యాంక్‌లో నేను, మా నాన్న హీర్యానాయక్ రుణం తీసుకున్నాం. వడ్డీతో కలిపి మొత్తం రూ.2.82 లక్షలు అయింది. రుణమాఫీ జాబితాలో మా ఇద్దరి పేర్లు ఉన్నాయి. మాఫీ అయ్యిందని సంతోషంగా బ్యాంక్‌కి వెళితే, రెండు లక్షలకు పైన ఉన్న డబ్బులు కడితేనే మాఫీ అవుతుందని అధికారులు కొర్రీలు పెడుతున్నారు. రైతులపై ప్రభుత్వం షరతులు విధించడం సబబు కాదు. కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
– పాపానాయక్, పుల్లేరుబోడు తండా, కడ్తాల్ మండలం
నయాపైసా మాఫీ కాలేదు..
ఎన్నికల్లో రైతుల కష్టాలు తీర్చుతం, అది చేస్తాం.. ఇది చేస్తామని గద్దెనెక్కి ఇప్పుడు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది. ఒకే సారి అందరికీ పంట రుణ మాఫీ అని చెప్పి, కొందరికే మాఫీ చేసి చేతులు దులుపుకున్నది. మాఫీ చేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం సున్నా. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్‌కు బుద్ధి చెబుతాం. నాకు మూడు విడుతల్లోనూ నయాపైసా రుణం మాఫీ కాలేదు.
– అంజిరెడ్డి, కమ్మెట గ్రామం, చేవెళ్ల మండలం