రుణమాఫీ కాకపోవడంతో రైతులు సాగు పనులను వదులుకుని బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ రోజుల తరబడిగా ప్రదక్షిణలు చేశారు. బాధిత రైతుల నుంచి పెద్ద ఎత్తున అధికారులకు దరఖాస్తులు సైతం అందాయి. ఇకనైనా తమ సమస్య పరిష్కారమవుతుందని ఆశించిన రైతన్నలకు సర్వే పేరుతో ప్రభుత్వం సాగదీసే ప్రయత్నాలకు పూనుకున్నది. ప్రభుత్వం చెప్పినట్లుగా.. మంగళవారం నుంచి ఇంటింటి సర్వేను చేపట్టాల్సి ఉండగా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం కాలేదు. యాప్‌పై స్పష్టత లేక అందుబాటులోకి తీసుకురాలేకపోవడం వల్లే సర్వేను చేపట్టలేదని తెలుస్తున్నది. రోజుకో ప్రకటనతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో.. బాధిత రైతన్నలు చిక్కులు తొలగి మాఫీ అయ్యేనా ? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్నారు.
– రంగారెడ్డి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రుణమాఫీకాని రైతులు ఆందోళన బాట పట్టారు. కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ కార్యాలయంతోపాటు మండల వ్యవసాయ కార్యాలయాలకు ఊరూరా కదిలి వస్తున్నారు. మేం తీసుకున్న రుణాలు రూ.2 లక్షల్లోపే ఉన్నా ఎందుకు మాఫీ చేయలేరంటూ అధికారులను నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన నిబంధనలతో జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ 60-70 శాతం మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు.
వికారాబాద్ మండలంలోని గొట్టిముక్కలలో కేవలం 40 శాతం మంది రైతులకు సంబంధించిన రుణాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది. గొట్టిముక్కల గ్రామంలో రూ.2 లక్షల్లోపు రుణాలు తీసుకున్న రైతులు సుమారు 300 మంది ఉండగా, వీరిలో కేవలం 100 మంది రైతులకు సంబంధించిన రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగతా 60 శాతం మంది రైతుల రుణాలు రూ.2 లక్షల్లోపు ఉన్నప్పటికీ మాఫీ కాలేదు. రుణమాఫీకాని రైతుల్లో ఎక్కువ మంది రేషన్‌కార్డు లేకపోవడంతోనే నష్టపోయారు.
పేరు ఒకరిది ఆధార్ నంబర్ మరొకరిది.. రైతుల పేర్లు తప్పుగా నమోదు చేయడం.. ఆధార్‌లో ఉన్న పేరుకు పట్టాదారు పాసుపుస్తకంలో ఉన్న పేరు ఒకేలా ఉండకపోవడం.. ఇలా రుణమాఫీ జాబితా తప్పుగా నమోదు కావడంతోపాటు రైతులు ఏటా రెన్యువల్ చేసుకున్నప్పటికీ.. రెన్యువల్ చేసుకోలేదని బ్యాంకర్లు తప్పుగా ఎంట్రీ చేయడంతో చాలా మంది రైతులు నష్టపోయినట్లు స్పష్టమవుతున్నది. వ్యవసాయ కార్యాలయాలకు వెళ్తే వివరాలను తెలుసుకొని పంపిస్తున్నారని గ్రామ రైతులు పేర్కొంటున్నారు. రేషన్‌కార్డు మెలిక పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్షలోపు రుణాలు అర్హులందరికీ మాఫీ అయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన షరతులతో నష్టపోయామని రైతులు వాపోయారు.
గ్రీవెన్స్‌కు 6 వేల ఫిర్యాదులు..
జిల్లాలో రుణమాఫీ కాలేదని వస్తున్న ఫిర్యాదులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 6 వేల ఫిర్యాదుల వరకు గ్రీవెన్స్ వచ్చాయి. గ్రీవెన్స్‌లో అత్యధికంగా సుమారు 2 వేల ఫిర్యాదుల వరకు రేషన్ కార్డు లేకపోవడంతోనే రుణమాఫీకి దూరమైనట్లు తెలుస్తున్నది. గత 20 రోజులుగా వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా త్వరలో మీ రుణాలు మాఫీ అవుతాయంటూ సమాధానం చెబుతూ రైతులను పంపించేస్తున్నారు. వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు చెబుతున్న సమాధానాలకు ఏ మాత్రం పొంతన లేకపోవడంతో వ్యవసాయ కార్యాలయాల వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఫిర్యాదు చేసేందుకు వచ్చే రైతులకు వ్యవసాయాధికారులు ఏదో ఒకటి చెబుతూ పంపిస్తున్నారు. మరోవైపు రూ.2 లక్షల రుణాలకు మించి ఉన్న రైతుల పరిస్థితి మరీ గందరగోళంగా తయారైంది. కటాఫ్ రుణానికి మించి ఉన్న రైతుల్లో చాలా మంది ఇప్పటికే పైన ఉన్న రుణాలను చెల్లించి సంబంధిత రసీదులను వ్యవసాయాధికారులకు అందజేసినప్పటికీ ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కటాఫ్ రుణాన్ని చెల్లిస్తేనే మాఫీ అవుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నప్పటికీ ఎప్పుడు మాఫీ అవుతుందని, దానికి సంబంధించిన విధివిధానాలు ఇప్పటివరకు ఖరారు కాకపోవడం గమనార్హం.
ప్రతి ఏడాది రెన్యువల్ చేశాం..
నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. వికారాబాద్ యూనియన్ బ్యాంకులో రూ.1.60లక్షలు రుణం తీసుకున్నా. నా భార్యకు ఒకటిన్నర ఎకర పొలం ఉన్నది. రూ.80వేలు తీసుకున్నాం. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేశాం. రెండు, మూడో విడుత అంటూ అధికారులు మాట దాటవేశారు. ప్రస్తుతం వ్యవసాయాధికారులను అడగగా వస్తాయి అంటూ సమాధానమే చెబుతున్నారే తప్పా మాఫీ కావడం లేదు. రేషన్ కార్డు కారణమని చెబుతున్నారు. ఎన్నికల ముందు రుణ మాఫీ చేసే సమయంలో ఇలాంటి షరతులు ఎందుకు తెలుపలేదు.
– వెంకటేశ్, గొట్టిముక్కల, వికారాబాద్
సరైన సమాధానం లేదు..
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. నాకు రూ.1.80 లక్షలు అప్పు ఉన్నది. నా పేరుపై 3.30ఎకరాల భూమి ఉన్నది. 2018లో వికారాబాద్ యూనియన్ బ్యాంక్‌లో రుణం తీసుకున్నా. ఏటా రెన్యువల్ చేశా. నాతో పాటు మా గ్రామంలో 60 శాతం వరకు మాఫీ అయ్యాయి. మాకెందుకు కాలేదని అధికారులను అడిగితే ఎప్పుడు వస్తాయో మాకు కూడా తెలియదని చెబుతున్నారు.
– కొండాపురం రామకృష్ణ, గొట్టిముక్కల, వికారాబాద్
కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలె..
ఎన్నికలప్పుడు ఎలాంటి షరతుల్లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. మాట నిలబెట్టుకోవాలి. నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది. వికారాబాద్ యూనియన్ బ్యాంకులో రూ.లక్ష, శివారెడ్డిపేట సొసైటీ బ్యాంకులో రూ.1.30 లక్షల రుణం తీసుకున్నా. శివారెడ్డిపేట సొసైటీలో రెన్యువల్ చేశాం. గత కొన్ని రోజుల కింద బ్యాంకు అధికారులకు రూ.7వేల రుణాన్ని సైతం చెల్లించినా రుణం మాఫీ కాలె. రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు.
– పట్లే ఆంజనేయులు, గొట్టిముక్కల, వికారాబాద్