ఉప్పల్, మార్చి 16: స్వశక్తితో జీవించడం ద్వారా మహిళల ఆత్మగౌరవం పెరుగుతుందని డీజీపి జితేందర్ అన్నారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆదివారం మహిళలకు ఉద్యోగాల కల్పనకు ఉప్పల్ లో భారీ జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ సమాజంలో సగభాగం ఉన్న మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి విధి అని తెలిపారు. మహిళలు విభిన్న పాత్రలు పోషిస్తూ పురుషుడి విజయంలోనూ, అతని సుఖ సంతోషాల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తారని, అటువంటి స్త్రీలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
స్త్రీలు కేవలం ఇంటికి పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదివి, తమలో గల విభిన్న నైపుణ్యాలను, మేధస్సునుపయోగించుకుని అర్హతలకు తగిన ఉన్నత ఉద్యోగ అవకాశాలు దక్కించుకొని ముందుకు వెళ్లాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. స్త్రీలు ఆత్మగౌరవంతో బతకడంతో వారి విలువ మరింతగా పెరుగుతుందని, స్వశక్తితో బతకడం అనేది అందుకు మరింతగా దోహదం చేస్తుందన్నారు. స్త్రీలు తమకున్న నైపుణ్యాలను కోల్పోకూడదని, వారికున్న మేధస్సును సమాజానికి ఉపయోగపడేలా చేయాలని, ఉత్సాహంగా అందుబాటులో గల ఉద్యోగ అవకాశాలను దక్కించుకొని సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.
మనదేశంలో అధిక సంఖ్యలో ఉన్న యువ జనాభా మనకు గొప్ప సంపద అని జితేందర్ చెప్పారు. యువశక్తిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. రోజురోజుకూ ప్రపంచం మరింతగా కొత్త పుంతలు తొక్కుతున్నదన్నారు. అన్ని రంగాల్లోనూ పోటీతత్వం పెరుగుతోందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను, శక్తియుక్తులను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించుకోవడమేనన్నారు. మహిళలు తమ నైపుణ్యాలు, మేధస్సును ఉపయోగించుకుని తమ స్వశక్తితో జీవించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం మరింతగా పెరుగుతాయని తెలిపారు. అందుకు దోహదపడేలా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా దాదాపు 2800 మంది ఉత్సాహవంతులైన మహిళలు ఉద్యోగ అవకాశాల కోసం నమోదు చేసుకోగా వారిలో విభిన్న అర్హతలు, నైపుణ్యాలు కల దాదాపు 2323 మంది ఉద్యోగాలు పొందినట్లు పేర్కొన్నారు.
ఈ జాబ్ మేళాతో ఉద్యోగాలు పొందిన మహిళలు తమ వృత్తి జీవితంలో మరింతగా ఎదిగేందుకు అవసరమైన అన్ని రకాల తోడ్పాటును కూడా భవిష్యత్లో అందిస్తామని సుధీర్ బాబు హామీ ఇచ్చారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ లోని సభ్య కంపెనీలు గొప్ప మనసుతో ముందుకు వచ్చి ఎంతోమంది ఆశావాహులైన మహిళలకు ఉద్యోగాలు కల్పించడం అనేది ఎంతో గొప్ప విషయమని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ పీవీ పద్మజ, యాదాద్రి డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, అడ్మినిస్ట్రేషన్ డీసీపీ ఇందిర, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా విశ్వనాథ్, రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ జీ నరసింహారెడ్డి, ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి, డీసీపీ శ్యామ్ సుందర్, సైబర్ క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి, ఫోరమ్ సంయుక్త కార్యదర్శులు వాసుదేవ్ రావు, డాక్టర్ రాధికానాథ్, శ్రీనివాస్, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.