ప్రపంచంలోని అందమైన నగరాలు అనేకం నదుల ఒడ్డునే కొలువుదీరాయి. థేమ్స్ నది ఒడ్డున లండన్… సెయిన్ నది ఒడ్డున ప్యారిస్… రెడ్ రివర్ ఒడ్డున వియత్నాం. మన చారిత్రక హైదరాబాద్‌కూ అలాంటి ప్రకృతి వరం ఉంది.నగరం మధ్య నుంచి సుందరంగా మూసీ నది ప్రవహిస్తున్నది. కానీ దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యంతో అది మురుగుకు పర్యాయపదంగా మారింది. అలాంటి చారిత్రక మూసీ నదికి తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవం కల్పించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు గురువారం తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి జంట జలాశయాలకు గోదావరి జలాలను తరలించే లింకు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. కానీ వాస్తవానికి సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో కాళేశ్వరజలాలతో మూసీని మురిపించాలని సంకల్పించి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రూపకల్పనలోనే ఈ లింకును పొందుపరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి 700 క్యూసెక్కుల గోదావరి జలాలను జంట జలాశయాలకు కేటాయించారు. తద్వారా మూసీకి మురుగు కూపం నుంచి విముక్తి కల్పించి విశ్వనగర ప్రతిష్ఠతను మరింత ఇనుమడింపజేసేందుకు కార్యాచరణ రూపొందించారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 18 (నమస్తే తెలంగాణ)
అరవయ్యేండ్ల సమైక్య పాలనలో మురుగుతో కుమిలిపోయిన మూసీ నది పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మూసీ మురికిని కూడా వదిలించనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వర జలాల్ని జంట జలాశయాలకు తరలించేలా అలైన్మెంట్ రూపొందించారు. ఈ మేరకు కొండపోచమ్మ సాగర్ నుంచి హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (జంట జలాశయాలు)కు లింకు ప్రాజెక్టుకు గురువారం తెలంగాణ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
పూర్తి కావస్తున్న కాల్వ పనులు…
సంగారెడ్డి కాల్వ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. సాగునీటి అవసరాల దృష్ట్యా జల వనరుల శాఖ 127 కిలోమీటర్ల కాల్వ నిర్మించనుంది. అయితే రావిల్కోట్ దగ్గరి నుంచి గండిపేట వరకు జలాల్ని తరలించే పనుల్ని జలమండలి చేపట్టాల్సి ఉంది. ఆ లింకు ప్రాజెక్టుకే తాజాగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంటే కొండపోచమ్మ సాగర్ నుంచి జంట జలాశయాల వరకు 85 కిలోమీటర్ల కాల్వ పనులకుగాను 27 కిలోమీటర్ల సంగారెడ్డి కాల్వ పనుల్ని జల వనరుల శాఖ పూర్తి చేసింది. తదుపరి మిగిలిన 56 కిలోమీటర్ల కాల్వ పనుల్ని జలమండలి చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనులు పూర్తయితే మూడున్నర టీఎంసీల చొప్పున గండిపేట, హిమాయత్సాగర్ల్లో కాళేశ్వరజలాలు నిండనున్నాయి. తద్వారా గోదావరిజలాలతో మూసీ పొడవునా మురికిని తొలగించి… ప్రక్షాళన పూర్తవుతుంది. కొండ పోచమ్మసాగర్ నుంచి జంట జలాశయాలకు గోదావరిజలాలను తరలించిన తర్వాత అవసరానికి అనుగుణంగా మూసీలోకి నీటిని వదిలేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుందని అధికారి ఒకరు తెలిపారు. ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ నుంచి గేట్ల ఎత్తిపోత ద్వారా వదిలే జలాలు వేర్వేరు మార్గాల్లో వచ్చి లంగర్‌హౌస్ వద్ద మూసీలోకి వస్తాయి. దీంతో పరిస్థితికి అనుగుణంగా మూసీలోకి గోదావరిజలాలు వదలడం ద్వారా మూసీ మార్గంలో ఉన్న వ్యర్థాలు కొట్టుకుపోయి నదీమార్గం అంతా సాఫీగా తయారు కానుంది.
పర్యాటకంలో పతాక స్థాయికి…
చారిత్రాత్మకంగానే కాదు భౌగోళికంగానూ అనుకూలంగా ఉండే నగరాలు ప్రపంచంలో వేళ్ల మీద లెక్కించవచ్చు. అందులో హైదరాబాద్ మహా నగరం కూడా ముందు వరుసలో ఉంటుంది. అందుకే అంతర్జాతీయంగా అనేక బడా కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలు తెరిచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చారిత్రాత్మకంగానూ ఎంతో ప్రాధాన్యమున్న హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన పూర్తయితే మూసీ పరివాహక ప్రాంతమంతా పర్యాటకంగా అభివృద్ధి కానుంది. ఇప్పటికే ప్రభుత్వం పచ్చదనం, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటును ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఉదాహరణకు… థేమ్స్ నది ఒడ్డున పర్యాటకం అభివృద్ధి చెందడం ద్వారా 99వేల కుటుంబాలు నది ఒడ్డున వ్యాపారాలు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. అంటే రానున్న కాలంలో మూసీ పరివాహక ప్రాంతం కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందినట్లయితే వేలాది కుటుంబాలకు ఉపాధి లభించనుంది.
గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం
కొండపోచమ్మ సాగర్ నుంచి జంట జలాశయాలకు గోదావరిజలాలను తరలించే ప్రక్రియ పూర్తయితే మరో చారిత్రక ఘట్టం కూడా ఆవిష్కృతం కానుంది. మూసీ కృష్ణాకు ఉపనది. జంట జలాశయాలకు గోదావరిజలాలను తరలించడం ద్వారా మూసీ నుంచి ఆ జలాలు తిరిగి కృష్ణాలోకి చేరనున్నాయి. అంటే వయా మూసీ గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం జరగనుండటం మరో విశేషం.