షాబాద్, ఫిబ్రవరి 22: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నది. ప్రజల ఆస్తి ఎల్ఐసీని ప్రైవేటు పరం చేస్తామని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు చౌకగా కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద సంస్థ అయిన ఎల్ఐసీలో వాటాలను విక్రయించి సొమ్ము చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ప్రైవేటీకరణ దిశగా చర్యలు తీసుకోవడం మంచి పద్ధతి కాదని పలువురు హితవు పలుకుతున్నారు. పాలసీదారుల సొమ్మును అమ్ముకుని ప్రభుత్వ ఖాజానా నింపుకోవడం దారుణమంటున్నారు. ఇంతకు ముం దు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోవడానికి ఆయా సంస్థలు బహిరంగ మార్కెట్లో ప్రకటించిన ఐపీవోలతో వాటి వాటాలను ఎల్ఐసీ కొనుగోలు చేసేది. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక కామధేనువుగా, కల్పతరువుగా నిలిచింది. కానీ కొవిడ్ మహమ్మారితో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను కాయకల్ప చికిత్స చేయడానికి ఎల్ఐసీని ప్రైవేటీకరించి ప్రభుత్వ నిధులు, ప్రజల బీమా పాలసీలు కొనుగోలు చేయడం వల్ల పొదుపు చేసిన సొమ్మును బహిరంగ మార్కెట్లోకి పంపేందుకూ కేంద్రం వెనుకాడటం లేదని మండిపడుతున్నారు. అసలు లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు విక్రయించాల్సి వస్తున్నదని పలువురు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎల్ఐసీని ప్రైవేటీకరిస్తే ఉద్యోగాల పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు. ఎక్కడైనా నష్టాలు వస్తే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతారు.. కానీ, లాభాల్లో ఉన్న ఎల్ఐసీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేయడం సరికాదని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీపై తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు.
పరిగి, ఫిబ్రవరి 22: సాధారణంగా నష్టాల్లో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లాభాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభు త్వం భారతీయ జీవిత బీమా సంస్థను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నది. వినియోగదారులకు చక్కటి సేవలు అందిస్తూ, లాభాల్లో కొనసాగుతూ ప్రపంచంలోనే పేరెన్నికగల సంస్థగా ఎల్ఐసీ నిలిచిం ది. ఈ సంస్థను సైతం విక్రయించాలని కేంద్రం నిర్ణయించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎల్ఐసీని విక్రయించేందుకు చురు గ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎల్ఐసీకి సంబంధించి ముసాయిదా పత్రాలను ప్రభు ప్రభు త్వం మార్కెట్ల నియంత్రణ సంస్థకు సమర్పించింది. మొదటి విడుతలో 5 శాతం వాటా విక్రయానికి సర్కారు నిర్ణయించింది. దీంతో రూ. 63వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
చేస్తుండటంపై ప్రజల నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎల్ఐసీ అనేది సామాన్య ప్రజల్లో పూర్తిస్థాయిలో నమ్మకమైన సంస్థగా పేరొందింది. ఇందుకుగాను ప్రతి గ్రామంలోనూ ఏజెంట్లు ఉన్నారు. రోజు కూలీ పని చేసుకునే వారి దగ్గర నుం చి ఉన్నత ఉద్యోగులు, వ్యాపారులు జీవిత బీమా పాలసీలు చేసే విధంగా గ్రామాల్లో ఏజెంట్లు ప్రోత్సహిస్తుంటారు. వారికి ఆయా బీమా పాలసీలకు అనుగుణంగా కమీషన్ రూపంలో డబ్బులు అందుతా యి. సంస్థపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచే విధంగా ఏజెంట్లు తమ సేవలు అందజేయడం జరుగుతున్నది. గతంలో సమాచార వ్యవస్థ చాలా తక్కువగా ఉన్నప్పుడు ప్రతి ఏజెంట్ తాను బీమా చేయించిన వారిని ముందుగానే కలిసి మీ బీమా డబ్బును సంబంధిత తేదీలోపు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేయడం, వారి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లి కార్యాలయంలో చెల్లించి రశీదులను తిరిగి వారికి అందించడం.. బీమా సంస్థ ద్వారా శరవేగంగా సేవలు అందేలా చూడడంలో ఏజెంట్ వ్యవస్థ చురుకుగా పని చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటిది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్ఐసీని విక్రయించాలని తీసుకున్న నిర్ణయంతో ఈ సంస్థపై ఆధారపడి జీవిస్తున్న ఏజెంట్లు, ఉద్యోగులు, పాలసీదారులకు తీవ్ర నష్టం జరుగనున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో ఎల్ఐసీ ఏజెంట్లు వేలాది మంది ఉంటారు. వారందరి జీవనోపాధి ఈ సంస్థ అభివృద్ధితో ముడిపడి ఉన్నది. అలాంటిది సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలోని వేలాది మంది కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ప్రధా ని మోదీ ప్రభుత్వం
ఎల్ఐసీని విక్రయించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిచో సంస్థను నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం సరికాదు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించాలనుకోవడం సరికాదు. ఎల్ఐసీని ప్రైవేటీకరిస్తే ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరైనా నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరిస్తారు.. కానీ లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ప్రైవేటీకరించాలన్న నిర్ణయం చాలా దారుణం.
– భూపాల్‌రెడ్డి, హైతాబాద్, షాబాద్
బీజేపీకి తగిన గుణపాఠం తప్పదు..
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం తప్పదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ సొమ్ము చేసుకుని దేశానికి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి. ఎల్ఐసీని విక్రయించాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం సరికాదు.
– ఇనాయత్, బోడంపహాడ్, షాబాద్
ప్రైవేటీకరించడం దారుణం..
ఎల్ఐసీలో లక్షలాది మంది పాలసీదారులు .. వేలాది మంది ఉద్యోగులు, ఏజెంట్లు ఉన్నారు. ఎల్ఐసీని ప్రైవేటు పరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం అత్యంత దారుణం. ఉద్యోగుల భద్రతతో పాటు పాలసీదారుల డబ్బులకు కూడా రక్షణ ఉండదు.
– అశోక్, గుండుకేరి, షాద్‌నగర్
లాభాల్లో ఉన్న సంస్థను ఆగం చేస్తుండ్రు..
లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీని బీజేపీ ప్రభుత్వం ఆగం చేస్తున్నది. సంస్థలోని ఉద్యోగులు, పాలసీదారులు, ఏజెంట్ల క్షేమాన్ని విస్మరిస్తున్నది. రానున్న కాలంలో ఇందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
– అశ్విన్‌కుమార్, ఎల్ఐసీ ఏజెంట్, వికారాబాద్
కొంతమంది వ్యక్తుల కోసం..
లాభాల్లో ఉన్న ఎల్ఐసీ ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఇప్పటివర కు ప్రజల్లో మంచి పేరు ఉంది. లాభాల్లో ఉండి పాలసీదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న సం స్థను కొంతమంది వ్యక్తుల కోసం ప్రైవేట్‌పరం చేసేందుకు నిర్ణయాలు తీసుకోవడం సరికాదు.
– కేవీ రమేశ్‌రాజు, ఇబ్రహీంపట్నం
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..
ఎల్ఐసీని ప్రైవేటు పరం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టే ఎల్ఐసీలో లక్షలాది మంది సభ్యులుగా చేరారు. దానిని ప్రైవేటీకరిస్తే ప్రజల్లో నమ్మకం పోతుంది.
– వేణుగోపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం
కేంద్రం పెద్ద కుట్ర…
కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ఎల్ఐసీనిప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్రలు చేయడం మంచిది కాదు. దేశవ్యాప్తంగా ఎంతోమందికి సామాజిక భద్రత, జీవిత బీమాను అందిస్తూనే దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచిన ఎల్ఐసీని ప్రైవేటీకరించడం సరికాదు. ఈ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి. – సత్తు వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం
ప్రజలకు నమ్మకం పోతుంది
ఎల్ఐసీ సంస్థపై ఆధారపడి లక్షలాది మంది బతు కుతున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రైవేటీక రిస్తామని ప్రకటించడం సరికాదు. దీంతో దానిపై ప్రజలకు నమ్మకం పోవడంతోపాటు ఉద్యోగులు, ఏజెంట్లు రోడ్డుపాలవుతారు.
– సంతోష్, రాంనగర్, కులకచర్ల మండలం
ప్రైవేటు పరం చేయొద్దు..
ఎల్ఐసీని ప్రైవేటు పరం చేయొద్దు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎంతోమంది ఉద్యోగులు, ఏజెంట్లు రోడ్డున పడాల్సి వస్తుంది. ఎల్ఐసీని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించాలి.
– కృష్ణానాయక్, ఎల్ఐసీ ఏజెంట్ పరిగి
ఇబ్బందులు కలుగుతాయి..
ఎల్ఐసీని ప్రైవేటీకరిస్తే పాలసీదారులు, ఉద్యోగులు, ఏజెంట్లకు ఇబ్బందులు కలుగుతాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలి. లేదంటే రానున్న రోజు ల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
– రాములు, నాగారంతండా, ధారూరు మండలం
సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది
ప్రభుత్వ రంగ సంస్థ అనే నమ్మకంతోనే ఎక్కువ మంది ఎల్ఐసీని ఆదరిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభు త్వం దానిని ప్రైవేటీకరిస్తే ప్రజల్లో విశ్వాసం పోతుం ది. తద్వారా ఎల్ఐసీ పాలసీదారుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రైవేటీకరణతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ ప్రైవేటీకరణపై పునరాలోచించాలి.
– యాదయ్యగౌడ్, ఎల్ఐసీ ఏజెంట్, ఆమనగల్లు
ప్రజల బాగోగులు అవసరం లేదా ?
కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీని ప్రైవేటు పరం చేస్తామని ప్రకటించడం బాధాకరం. ఎంతో మంది పాలసీలు తీసుకుని నమ్మకంతో ఉన్నారు. ప్రధాని మోదీ సర్కారుకు ప్రజల బాగోగులు అవసరం లేనట్లుగా వ్యవహరించడం తగదు. వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
– విజయ్‌కుమార్, ఎల్ఐసీ ఏజెంట్, చిన్ననందిగామ, కొడంగల్