రంగారెడ్డి, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో భూసేకరణకు రైతులు ముందుకు రావడంలేదు. భూముల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వివిధ అవసరాల పేరుతో చేపడుతున్న భూసేకరణపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నది. రైతులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. భూముల నుంచి తమను విడదీయొద్దని వేడుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఫార్మాసిటీ భూముల చుట్టూ అధికారులు ఫెన్సింగ్ పనులను చేపట్టగా రైతులు అడ్డుకున్నారు.
మరోవైపు రైతులకు చెందిన 2,500 ఎకరాల పట్టా భూములను ప్రభుత్వం పరిహారం చెల్లించకుండానే సర్కారు పేరుతో మార్చుకోవడంతో రైతులు పోరాడుతున్నారు. అదేవిధంగా, ఫ్యూచర్ సిటీ కోసం కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు వరకు 330 ఫీట్లతో గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించి.. ఇందుకోసం 1000 ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధంగా కాగా.. రైతులు తమ భూములను ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పోలీసు పహారాలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు తీసుకునే భూముల్లో హద్దులను నిర్ధారించింది. దీంతో గ్రీన్ ఫీల్డ్, ఫార్మా భూములకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.
మాడ్గుల మండలంలోని ఇర్విన్లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ను వెంటనే రద్దు చేయాలని ఆ గ్రామ రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడుతున్నారు. గ్రామంలోని సుమారు 1075 ఎకరాల్లో రిజర్వాయర్ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తైతే గ్రామంలోని సగం మంది రైతుల భూములు పోయి రోడ్డున పడే పరిస్థితి వస్తుందని.. తాము ఎలా బతకాలని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
శనివారం రిజర్వాయర్ నిర్మాణానికి భూములిచ్చే ప్రసక్తే లేదని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టి.. తమ నిరసనను తెలిపారు. తమ భూములను తీసుకుంటే.. భూమికి భూమికి ఇవ్వాలని.. లేదా.. బయట మార్కెట్ ప్రకారం ఎకరానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వం యాచారం మండలంలోని మొండిగౌరెల్లి, కందుకూరు మండలంలోని తిమ్మాపూర్, లేమూరు తదితర గ్రామాల్లో భూసేకరణకు ఏర్పాట్లు చేస్తున్నది. అయితే ఆ భూములను ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసి సరిఫికెట్లు కూడా ఇచ్చింది. అదేవిధంగా సరూర్నగర్ మండలంలోని గుర్రంగూడ.. బాలాపూర్ మండలంలోని కురుమలగూడ తదితర గ్రామాల్లోని పేదల భూములను సర్కార్ తీసుకోవాలని యత్నిస్తుండగా.. తమ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. తమ భూములను ప్రభుత్వానికి ఇస్తే ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.