షాబాద్, జూన్ 24 : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం చేవెళ్లకు రానున్నారు. ఓటరు జాబితా రూపకల్పనపై భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ (ఎస్ఐఆర్), బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై చేవెళ్ల నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్ గేట్ వద్ద ఉన్న పద్మావతి కన్వెన్షన్‌లో జరిగే సమావేశానికి ఉదయం 10 గంటలకు కేటీఆర్ చేరుకుంటారు.
ఈ సందర్భంగా పార్టీ తరఫున నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్ఏలు), పార్టీ సభ్యత్వ నమో దు ఇన్చార్జీలు, సోషల్ మీడియా ప్రతినిధులు, నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్యనేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా డిజిటల్ సభ్యత్వ నమోదుపైనా అవగాహన కల్పించనున్నారు. మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి, కార్తిక్‌రెడ్డి, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి రాంబాబుయాదవ్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్‌ను భారీ సక్సెస్ చేసేలా చర్యలు చేపట్టారు.
28న వికారాబాద్‌కు కేటీఆర్‌కు..
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం గౌలికర్ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ఉంటుందని, దానిని సక్సెస్ చేయాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్‌హాల్‌ను ఆయన పార్టీ శ్రేణులతో పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 28న ఉదయం 9:30 గంటలకు మీటింగ్ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో గోపాల్ముదిరాజ్, ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖ ర్‌రెడ్డి, పాండు, మహిపాల్‌రెడ్డి, మల్లికార్జున్, సురేశ్, అనంత్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మల్లేశం, అనిల్, వేణుగోపాల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
రేపు పరిగికి ..
పరిగి : పరిగి పట్టణంలోని ఎస్ గార్డెన్లో ఈనెల 26 శుక్రవారం ఉదయం 10 గంటలకు సర్ (ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ బీఎల్ఎలు, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై పార్టీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం జరుగనున్నది. దీనికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవనున్నారు. అలాగే మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, పార్టీ సభ్యత్వ నమోదు పరిగి ఇన్చార్జి ఎం.ఎన్.శ్రీనివాస్‌రావు, జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారు. ఈ మీటింగ్‌కు సర్‌పై నియమింపబడిన బీఎల్ఎలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.