పరిగి : మున్సిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. గురువారం జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పట్టణప్రగతి, స్వచ్ఛ సర్వేక్షణ్-2022 వర్చువల్ ఓరియంటేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుధ్యం, పచ్చదనం, వైకుంఠధామాలు, డంప్‌యార్డులు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల ఏర్పాటు, ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త సేకరణ తదితర కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిబ్బందికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
అందరి సహకారంతో 2021లో తెలంగాణ సఫాయి ముద్ర ఛాలెంజ్‌లో తెలంగాణ రాష్ట్రం రెండోస్థానంలో నిలిచిందని, మరింత స్ఫూర్తితో ఈసారి మొదటి స్థానం వచ్చేలా కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతలో దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామాలు, పట్టణాలు సమ్మిళితమైన, సమతుల్యమైన పద్దతులలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామీణ అభివృద్ధిని, వ్యవసాయాన్ని, ఐటీ రంగాన్ని ముఖ్యమంత్రి వివిధ ప్రోత్సాహకాలతో నడిపిస్తున్నారని అన్నారు. పల్లెలను పట్టణాలతో పాటు ధీటుగా పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం చేపడుతున్నారని, కేంద్రం ప్రకటించిన పల్లె వికాసం అవార్డులో మనమే ముందున్నామని మంత్రి తెలిపారు. పట్టణ ప్రగతి కింద ఇప్పటి వరకు రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ. 3045కోట్లు అందించడం జరిగిందన్నారు. 2021-22లో మున్సిపాలిటీలకు రూ. 223కోట్లు కేటాయించడం జరిగిందని, ఎనిమిది శాతం గ్రీన్ కవర్ చేసి పర్యావరణానికి తోడ్పడ్డామని అన్నారు.
తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద రూ. 3వేల కోట్లతో పట్టణాలలో వివిధ అభివృద్ధి పనులు కనపడుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్ ప్రకారం 14000 కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించుకున్నామని, తద్వారా పట్టణాలకు వచ్చే మహిళలు, వృద్ధులు, పిల్లలకు బహిరంగ మలమూత్ర విసర్జనకు ఇబ్బంది కలగకుండా టాయిలెట్ల సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. మహిళలకు షీ టాయిలెట్స్ సైతం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. టాయిలెట్స్ కట్టడం చాలా సులువని, ప్రజలు వినియోగించే స్థాయిలో నిర్వహణ కోసం మున్సిపాలిటీలు పని చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, ఎక్కడైనా అలసత్వం, నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే మిషన్ భగీరథ గొప్ప కార్యక్రమమని, ప్రతి ఇంటికి తాగునీరు అందేలా సవ్యమైన పద్ధతిలో ప్రజలకు సరైన సేవలు అందించే దిశలో ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేయాలన్నారు. వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణాలకు రూ. 500కోట్లు కేటాయించడం జరిగిందని, వచ్చే జూన్‌లోపు మార్కెట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు.
వైకుంఠధామాల పనుల కోసం రూ. 200కోట్లు కేటాయించడం జరిగిందని, వీటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. వచ్చే ఫిబ్రవరి 24వ తేదీన పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలో చేసిన పనులకు పురస్కారాలు అందించడం జరుగుతుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి జిల్లాలో సమస్యల నివారణ కోసం ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని ముఖ్యమంత్రి నియమించారని తెలిపారు. మనం చేపట్టే పనులలో సిటిజన్ ఎంగేజ్మెంట్ పనులలో మహిళలు, ఉత్సాహవంతమైన యువత, రిటైర్డ్ అధికారులు, విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా వార్డు కమిటీలను పటిష్టం చేయాలన్నారు. కరోనా కారణంగా ప్రజలు డిజిటల్ సేవల వైపు మళ్లారని, అధికారులు సైతం సోషల్ మీడియాలో చురుకుగా ఉండి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. గతంలో గంగదేవిపల్లి ఒక్కటే ఆదర్శ గ్రామంగా ఉండేదని, ప్రస్తుతం ప్రతి పల్లె ఆదర్శ గ్రామంగా తయారవుతుందని చెప్పారు.
వీధులలో నేమ్‌బోర్డులు ఏర్పాటు చేయాలని, చేసిన పనులపై కరపత్రాలు, బుక్లెట్స్ రూపంలో ప్రజలకు తెలియజేయాలని మంత్రి సూచించారు. పచ్చదనం పెంపొందించే దిశగా పట్టణ ప్రణాళిక అభివృద్ధి చేయాలని, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలన్నారు. రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, ఎండీ ఎస్బిఎం అరవింద్‌కుమార్ పరిశుభ్రమైన పట్టణం, స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.