హాజరైన మాజీ మంత్రి, సబితాఇంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, వికారాబాద్, పరిగి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, పార్టీ తాండూరు సెగ్మెంట్ ఇన్చార్జి శ్రీశైల్‌రెడ్డి, సభ్యత్వ నమోదు ఇన్చార్జి రాంచందర్‌రావు
వికారాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్, చేవెళ్ల, పరిగి, తాండూరు రైతులకు సాగు నీరందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు వేసినా భయపడకుండా 90 శాతం పూర్తి చేశామని.. కేవలం పంపులు నడపడమే మిగిలి ఉందని.. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తే ప్రజలు కేసీఆర్‌ను గుర్తుంచుకుంటారన్న ఒకే ఒక్క కుట్రతో రేవంత్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ఆదివారం వికారాబాద్‌లో జరిగిన పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు, ‘సర్’పై వికారాబాద్ సెగ్మెంట్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ నీచ రాజకీయాలతోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతులకు నీళ్లు అందడంలేదని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుతో కోట్‌పల్లి మండలంలో 12వేల ఎకరాలకు, బంట్వారం మండలంలో 6వేలు, ధారూరులో 22వేలు, మర్పల్లిలో 30వేలు, మోమిన్‌పేటలో 18వేలు, వికారాబాద్ మండలం లో 10వేల ఎకరాలకు నీళ్లు అందేవని..రిజర్వాయర్లను కట్టించి 90 శా తం పూర్తి చేశామని.. మిగిలిన పనులను పూర్తి చేస్తే ఇప్పటికే నీళ్లు అందేవని కేటీఆర్ పేర్కొన్నారు.
వెనుకటికి ఎవరో తన మొహం బాగాలేక అద్దాన్ని పగలగొట్టినట్టు కాం గ్రెస్ పాలన ఉన్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేండ్లలో యూరియా ఎట్ల దొరికింది, కాంగ్రెస్ రావడంతోనే యూరి యా కోసం లైన్లు ఎందుకు కడుతున్నారో?, ఎందుకు దొరకడంలేదో దమ్ముంటే సర్కార్ సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో యూరియాతోపాటు కరెంట్ సక్కగా వచ్చిందని..మంచినీళ్లు సక్రమంగా సరఫరా అయ్యాయని, టైంకు రైతుబంధు వచ్చిందని.. కానీ, కాంగ్రెస్ పాలనలో ఏమి కూడా సక్రమంగా అందడంలేదని.. రైతుభరోసా దిక్కేలేదన్నారు. ఇప్పటికే మూడుసార్లు పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ ఎగ్గొట్టిందని ఆరోపించారు. అంతేకాకుండా అరకొరగా రుణమాఫీ చేసి రైతులను రేవంత్‌రెడ్డి దగా చేశాడని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవి కాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చడంలేదని మండిపడ్డారు.
జ్వరం వచ్చినా వికారాబాద్‌కు వచ్చా. ఇక్కడి గాలి పీల్చితే జ్వరం పో తుందని..ముచుకుంద, మూసీనది పుట్టిన స్థలం వికారాబాద్ అని, కొండలు, లోయలు, హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న కొండ ప్రాంతం వికారాబాద్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక్కడి గాలి పీల్చితే రోగాలు నయమవుతాయని పెద్దవాళ్లు చెప్పేవారు, ఇక్కడి గాలి మంచిదే, నీరు మంచిదే కానీ ఇక్కడ నాయకులు ఎవరినైతే మనం ఎన్నుకున్నామో వారే ఎలాంటోళ్లో ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఈ జిల్లా నుంచే స్పీకర్, సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2023 నవంబర్‌లో ఆనంద్ బహిరంగ సభ పెడితే నేను వచ్చా. పెద్దలు కేసీఆర్ వికారాబాద్‌కు వచ్చి ఒక్కటే మాట చెప్పాడు. మోసపోతే గోసపడతాం, ఆగమైతం దయచేసి ఆలోచించి ఓటేయానన్నారు.

బీఆర్ఎస్ ఓడింది కానీ జరిగింది ఏంది, లాభామా?, నష్టమా? ఎవరికి జరిగిందనేది ఆలోచించాలన్నారు. ఎమ్మెల్యేగా గతంలో ఆనంద్ ఐదేండ్లు పనిచేశారని.. ఆయన, ఆయన భార్య ఇద్దరూ డాక్టర్లు కావడంతో రెండు చేతుల సంపాదించుకోవచ్చు. కానీ, ఆయన సమాజం కోసం ఐదేండ్లు తండ్లాడారు. అందులో రెండేండ్లు కరోనా, మిగతా సమయం నేర్చుకునేందుకే సరిపోయిదన్నారు. రూపా యి లంచం తీసుకోకుండా వికారాబాద్‌కు నిధులివ్వాలని, వికా రాబాద్ ప్రజలకు మంచి చేసేందుకు సహకరించాలని అడిగాడు తప్పా ఎన్నాడూ వ్యక్తిగతంగా రూపాయి పని కూడా ఆనంద్ అడగలేదని గుర్తు చేశారు. మీకు సేవ చేసిన నాయకుడ్ని కారణాలు ఏమైనా మీరు పొగొట్టుకున్నారన్నారు.
వికారాబాద్‌కు కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, ఆయుష్ ఆసుపత్రి, గిరిజన భవన్ ఇవన్నీ కట్టుకున్నామని, రూ.93 కోట్లతో వికారాబాద్‌లో రైల్వేఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశామన్నారు. మరోవైపు వికారాబాద్ నియోజకవర్గంలోని 284 బూత్‌ల్లో సభ్యత్వ నమోదు, సర్ ప్రక్రియను సరిగ్గా చేయాలని, ఎస్ఐఆర్పై బీఎల్వోలతో కలిసి ఇంటింటికీ పోవాలని, బూత్ సభ్యత్వం, సర్‌ను పక్కాగా చేపట్టాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కొడంగల్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, పార్టీ తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, రాజూగౌడ్, వికారాబాద్ పట్టణాధ్యక్షుడు గోపాల్, బీఆర్ఎస్ నాయకులు రాంచంద్రరావు, బైండ్ల విజయ్‌కుమార్, మంచన్‌పల్లి సురేశ్, వేణుగోపాల్‌రెడ్డి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు నీరు, విద్య, వైద్యం, రైతుబంధు, ఉచిత కరెంట్ తదితర పథకాలు అన్ని వర్గాలకు అందాయి. కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉన్నది. కొడంగల్‌లో గత పదేండ్లుగా ఓటర్లు తగ్గిపోతున్నారు. 10 వేలకు మించి ఓటర్లు లేకపోయే సరికి.. పక్క గ్రామాలను కలుపుకొని ఓటర్ల సంఖ్యను పెంచుతున్నారు. కొడంగల్‌లో కాంగ్రెస్ వారు డబ్బులు పంచడంతోనే గెలిచారు..లేకుంటే మన మే గెలిచేది. అదేవిధంగా స్పీకర్ కూడా వికారాబాద్ సెగ్మెంట్లో గోల్మాల్ చేస్తున్నారు.
– గట్టు రాంచందర్‌రావు, సభ్యత్వ నమోదు ఇన్చార్జి
పరిగిలోని 20 గ్రామాల రైతుల పట్టా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటున్నది. రైతులు, మహిళలు కేటీఆర్ వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభు త్వం మోసం చేస్తున్నదని.. మా భూ ములు పోకుండా మీరే చూడాలని విన్నవించారు. వికారాబాద్‌ను జిల్లా గా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను మాజీ సీఎం కేసీఆర్ తీర్చారు. వికారాబాద్ జిల్లాపై కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉంది. బీఆర్ఎస్ను గెలిపించి మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చేసుకోవాలి. చినుకు పడితే చాలు రైతుల సెల్ఫోన్లకు టింగ్ టింగ్‌మని రైతుబంధు డబ్బులు పడేవి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుభరోసా ఇవ్వడకుండా ఇబ్బంది పెడుతున్నది. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు నమోదు చేయించుకోవాలని ఇంటింటికీ చెప్పేందుకు వెళ్తే మీరు ఏమి చేశారని వారిని నిలదీసి మొహంపైనే డోర్లు వేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతకు నిదర్శనం. బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ఓటు నమోదుపై ప్రజలకు వివరించాలి.
– పి.సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆగమవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి మీనాక్షీనటరాజన్కు వెన్నుపోటు పొడిచాయి. మీనాక్షి రాజ్యసభ సభ్యురాలైతే రేవంత్‌రెడ్డికి ఇబ్బందితప్పవని గ్రహించి ఏదో ఒక చిన్న కారణంతో బీజేపీతో రహస్యంగా కుట్ర పన్నారు. బెంగాల్లో మమతాబెనర్జీని ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయి. అక్కడి ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇతర రాష్ర్టాలకు పంపించి మమతకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించారు. అదేవిధంగా ఆంధ్రాలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు వారి కార్యకర్తలను ఓటర్ల వద్దకు పంపించి సేవా మిత్ర యాప్‌తో వైసీపీకి ఓట్లు రాకుండా మళ్లించారు. చంద్రబాబునాయుడు శిష్యుడు రేవంత్‌రెడ్డి కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగ్గా ఫారాలను బీఎల్వోలకు అందజేసి రసీదును పొందాలి. 2002లో ఓటరు ముసాయిదా ఆధారంగా వివరాలను నమోదు చేయించుకోవాలి.
-ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వికారాబాద్‌లో రోడ్లు బాగా లేక పిల్లను ఇవ్వడంలేదని చెప్పిన స్పీకర్.. 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఆయన ఎక్కడ రోడ్లు వేయించారో.. ఎంతమందికి వధువులతో వివాహం చేయించారో ప్రజలకు చెప్పాలి. జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద పెద్ద గుంతలు ఏర్పడినా వాటిని ఇప్పటికీ పూడ్చడంలో స్పీకర్ విఫలమయ్యారు. వికారాబాద్‌కు రూ.96 కోట్లతో రైల్వే బ్రిడ్జి మంజూరు చేస్తే మూడేండ్లు దాటినా పనులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. వికారాబాద్‌లో ఎస్టీపీకి మరమ్మతులు చేయకపోవడంతో డ్రైనేజీ నీరు వెళ్లి మూసీనదిలో కలుస్తున్నది.
ఎండాకాలంలో నీరు సక్రమంగా అందించపోవడంతో ధన్నారం, కోట్‌పల్లి, ధారూరులలో వారం రోజులపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 24 గంటల కరెంట్, పుష్కలంగా నీరు ఉండే. ధారూరు మండలంలోని అల్లీపూర్లో విద్యుత్ సరఫరా లేక గ్రామం రెండు రోజులపాటు అంధకారంలో మగ్గింది. తన హయాంలో ప్రతి క్షణం ప్రజల సంక్షేమానికే వినియోగించా. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నా. ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వ నమోదు చేసుకోవాలి. ఒక్కసారి సభ్యత్వ నమోదు చేసుకుంటే రెండేండ్ల వరకు అది వర్తిస్తుందన్నారు.
– డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే