రంగారెడ్డి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ)/ఆదిబట్ల : జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తామన్న ఫ్యూచర్‌సిటీ ఏఐ గ్రాఫిక్స్‌కే పరిమితమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్‌సిటీ పేరుతో జిల్లాలోని భూములను కొల్లగొట్టడం తప్ప సాధించిదేమీ లేదన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగుళూరు ఓఆర్ఆర్ సమీపంలో గల ప్రమిద గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ..ఫ్యూచర్‌సిటీ కోసం 330 ఫీట్ల వెడల్పు తో 41 కిలోమీటర్ల పొడవుతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును నిర్మిస్తున్నారని.. ఇందుకు జిల్లాలోని సుమా రు వెయ్యి ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కుంటున్నదని మండిపడ్డారు. అలాగే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాలనూ చట్టవిరుద్ధంగా తీసుకుంటున్నదన్నారు.
ఫ్యూచర్‌సిటీ మొత్తం ఒక డ్రామా అని ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కొల్లగొట్టేందుకే ఫ్యూచర్‌సిటీని అడ్డం పెట్టుకున్నారని దుయ్యబట్టారు. అలాగే, మరో 16 వేల ఎకరాల భూముల నూ ఫ్యూచర్‌సిటీ పేరుతో సేకరించేందుకు యత్నిస్తున్నదన్నారు. జిల్లాలో విలువైన భూములను ముఖ్యమంత్రి తన అనుచరులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని.. అందులో భాగంగానే నాదర్గుల్ గ్రామంలోని 613 సర్వేనంబర్‌లోని 7,000 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములు, కొహెడ మార్కెట్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన 172ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కుట్ర లు పన్నుతున్నారన్నారు. ఫోర్త్‌సిటీ పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ధోకా చేస్తున్నదన్నారు. ఆనాడు ఫార్మాసిటీకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం భూము లు సేకరిస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుత మంత్రులు గ్రామాల్లో తిరిగి తాము అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను రైతులకే అప్పగిస్తామని హామీఇచ్చి ఓట్లు వేయించుకుని.. పవర్లోకి రాగానే ఆ హామీని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేరు ఫ్యూచర్‌సిటీ అయినా లబ్ధి పొందుతున్నది మాత్రం ముఖ్యమంత్రి.. ఆయన అనుకూల సంస్థలు మాత్రమే అని కేటీఆర్ దుయ్యబట్టారు. రైతుల భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చి తద్వారా రైతులతో సెటిల్మెంట్ చేసుకుని ముఖ్యమంత్రి రూ. కోట్లు గడించేందుకు కుట్రపూరితంగా ఆలోచిస్తున్నారన్నారు. గత కేసీఆర్ హయాం లో 16 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉంటే 28 నెలల కాంగ్రెస్ పాలనలో కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చిందని.. రైతులను మోసం చేస్తూ ఆ భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. కార్యక్రమంలో మాజీ మం త్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, సత్తు వెంకటరమణారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి(బంటి)పై కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలం, స్థానిక ఎమ్మె ల్యే అరాచకాలకు ఎదురొడ్డి నిలిశారని బంటిని ప్రత్యేకంగా అభినందించారు. మంచి నాయకత్వం, మొండితనం ఉన్న నాయకుడు ఉంటే కచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని ప్రశాంత్‌రెడ్డి ఈ ఎన్నికలోనిరూపించారన్నా రు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఇలాంటి నాయకుడు ఎంతో అవసరమన్నారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని.. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తమ కుటుంబాలను పణంగా పెట్టి కాపాడారని.. వారందరికీ హృదయ పూర్వకంగా అభినందనలు తెలుపుతున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఓటర్లు బీఆర్ఎస్కు పూర్తి మెజార్టీ కట్టబెట్టినా.. కాంగ్రెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు చేసిన దుష్ట పన్నాగాలను కౌన్సిలర్లు తిప్పికొట్టారన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులుండగా.. అందులో బీఆర్ఎస్కు 13 స్థానాలతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఉందని .. అయినా స్థానిక ఎమ్మెల్యే రంగారెడ్డి అడ్డదారిలో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలను బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిప్పికొట్టారన్నారు.
మాజీ ఎమ్మె ల్యే కొండిగారి రాములు కుమారుడు త్రిలోక్ తన తండ్రి మృతి చెందిగా అంత్యక్రియలకు హాజరై తిరిగి బీఆర్ఎస్ను గెలిపించేందుకు క్యాంపులో చేరారని మాజీ మంత్రి కొనియాడారు. అలాగే, బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్ శ్వేత కూడా ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల్లో గెలిచారని, ఆమె బీసీ కాదని, ఆమెపై కావాలనే కేసు నమోదు చేయించారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డదారులు తొక్కినా ప్రజలు మాత్రం ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు.

బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఘనంగా జరిగాయి. కేటీఆర్ మంచిరెడ్డితో కేక్ కట్ చేయించి.. అనంతరం తినిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గురించి.. ఆయన అవినీతి గురిం చి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కేటీఆర్ అన్నారు. హోటళ్లు, బార్లు, క్రషర్లతోపాటు ఇతరుల నుంచి అడ్డగోలుగా ప్రతినెలా ఇంత చెల్లించాలని ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. ధనార్జనే ధ్యేయంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని.. ప్రజా సమస్యలు, అభివృద్ధిని గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రజల కోసం పనిచేసే మంచి నాయకుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అని, ఆయన్ను గెలిపించుకుంటే నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగి అనేక అడ్డంకులు సృష్టించిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కా అధికారిని వదిలిపెట్టబోమన్నారు.

ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలు రెండు కవల పిల్లల మాదిరిగా కలిసే ఉంటాయి. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే.. నేటి హస్తం పాలనలో అరాచకం, విధ్వంసం కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన త ర్వాత జిల్లాలోని 50 వేల ఎకరాల భూమిపై ప్రభుత్వంలోని పెద్దల కన్ను పడింది. మన జిల్లాను.. మన భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు.. తాము అధికారంలో కి రాగా నే ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇస్తామని హామీ ఇచ్చి..ఓట్లు వేయించుకుని.. పవర్లోకి రాగానే.. ఆ హామీని మరిచిపోయి రైతులను మోసం చేశారు. అంతేకాకుండా అభివృద్ధి పనుల పేరిట ప్రభుత్వ, ప్రైవేట్ భూములను బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారు. రైతులు భయపడొద్దు.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉం టుంది. కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష. కాంగ్రెస్ సర్కార్‌కు చరమగీతం పాడాలి.
-సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే
సొమ్మొక్కడిది.. సోకొక్కడిదిలా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరిస్థితి ఉన్నది. గత కేసీఆర్ హయాంలో ఇబ్రహీంపట్నం అభివృద్ధికి రూ. కోట్ల నిధుల ప్రొసీడింగ్‌లు ఇస్తే వాటిని రద్దు చేసి మళ్లీ నిధులు తీసుకొచ్చి తానే సెగ్మెంట్‌ను అభివృద్ధి చేస్తున్నానని శిలాఫలకాలు వేయిం చుకుంటున్నాడు. అధికారంలోకి వచ్చి 28 నెలలు దాటినా రూపాయీ నిధులు తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడంతో రాష్ట్రం పదేండ్లు వెనక్కి పోయింది. భూములను కొల్లగొట్టి జిల్లా ఉనికే లేకుండా రేవంత్‌రెడ్డి సర్కార్ చేస్తున్నది. ఇప్పటికే రెవెన్యూ మంత్రి కొడుకు నాదర్గుల్లో 14 వందల ఎకరాలను కొల్లగొట్టాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. గత కేసీఆర్ హయాంలో అభివృద్ధి పనులకు భూములను కేటాస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు భూములను కట్టబెడుతున్నది. ఎమ్మెల్యే రంగారెడ్డి దేవుడి పేరు చెప్పి భూకబ్జాలకు పాల్పడుతున్నాడు.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
రానున్న రోజుల్లో వంద రోజుల పాటు పాదయాత్రను నియోజకవర్గంలో చేపడుతా. ఇప్పటికే ఇబ్రహీంపట్నం మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఛేదించి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేశాం. ఎన్ని కష్టాలు ఎదురైనా కేసీఆర్ అడుగుజాడల్లో.. కేటీఆర్ ఆదేశాను సారం పనిచేశాం. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
– ప్రశాంత్‌కుమార్ రెడ్డి(బంటి), బీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకుడు
జిల్లాలోని భూములకు రెక్కలు రావడంతో కాంగ్రెస్ నాయకులు, పెద్దలు బందిపోటు దొంగల్లా జిల్లా భూములపై పడి కబ్జాలు చేస్తున్నా రు. ఇప్పటికే నాదర్గుల్ భూములతో జిల్లాలోని ప్రభుత్వ భూములనూ వదలడంలేదు. కబ్జా భూములపై అధికారులను నిలదీసినా కనీసం వారి నుంచి కూడా సమాధానం రావడంలేదు. 28 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజల సమస్యలు పరిష్కరించినా పాపాన పోవడంలేదు. దీంతో ప్రజలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండేండ్లు ఆగితే వచ్చేది మన ప్రభుత్వమే. పార్టీ శ్రేణులు, ప్రజలు కష్టపడి కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలి.
-క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు