మొయినాబాద్, జూన్ 25 : రాష్ట్రంలో రియల్ఎస్టేట్ కుప్పకూలేందుకు ప్రధాన కారణం రాహుల్, రేవంత్(ఆర్ఆర్) ట్యాక్సేనని.. ముఖ్యమంత్రి వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూళ్లు చేసి రాహుల్‌కు కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని పద్మావతి కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సర్(ఎస్ఐఆర్) శిక్షణ, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి సమావేశానికి ఆయన మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డితో హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం నలుమూలల అనేక కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు కావడంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. అందులో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భూముల ధరలు గణనీయంగా పెరిగి రియల్ఎస్టేట్ రంగం బాగా పుంజుకున్నదని గుర్తు చేశారు. ఈ రంగంపై ఆధారపడిన వేలాది మంది ఎంతో లబ్ధిపొందారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్, రేవంత్ (ఆర్ఆర్) ట్యాక్సీ వసూళ్లకు రేవంత్‌రెడ్డి సర్కారు తెరలేపటంతో రాష్ట్రంలో రియల్ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందన్నారు. ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధిని కోల్పోయి రోడ్డునపడ్డారన్నారు. బిల్డర్లను బెదిరించి స్కైర్ ఫీట్‌కు ఇంత ధర అని నిర్ణయించి మరీ వారి నుంచి వసూళ్లకు పాల్పడడంతో.. పెట్టుబడి పెట్టేందుకు బిల్డర్లు ముందుకు రావటంలేదన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో షాబాద్‌లోని చందనవెల్లి, సీతారాంపూర్ గ్రామాల్లో పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రముఖ కంపెనీలను అక్కడ స్థాపించడంతో స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగు కాగా.. ఆ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయన్నారు. పారిశ్రామికవాడ ఏర్పాటు కాక ముందు లక్షల్లో ఉన్న భూముల ధరలు.. అవి వచ్చిన తర్వాత కోట్లకు ఎగబాకాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అవసరానికి భూములను అమ్ముదామనుకుంటే ఎకరానికి రూ.60 లక్షలు కూడా రావడం లేదన్నా రు. రియల్ ఎస్టేట్‌పై ఆధారపడిన లక్షలాది మంది రోడ్డునపడ్డారని ఆరోపించారు. మోసపూరిత మాటలు నమ్మి కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెడితే అన్ని వర్గాల ప్రజలను కష్టాల పాలు చేస్తున్నదని దుయ్యబట్టారు. రానున్నది మన ప్రభుత్వమేనని మళ్లీ భూముల ధరలు పెరిగేలా పాలసీలను తీసుకొస్తామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బడేభాయ్ ప్రతి వ్యక్తి అకౌంట్లో రూ.15 లక్షలు జమ చేస్తానని చెప్పగా.. రాష్ట్రంలో ఉన్న చోటాభాయ్ ప్రతి రైతుకూ రూ.15 వేలు ఇస్తానని హామీలిచ్చి ప్రజలు, రైతులను మోసం చేశారని మండిపడ్డారు.
రంగారెడ్డి-పాలమూరు ప్రాజెక్టుకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేస్తే 10 శాతం పనులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డికి మనసు రావడంలేదన్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకొక మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసి.. డాక్టర్లు అయ్యేలా చర్యలు తీసుకున్నదన్నారు. వికారాబాద్ కూ కొత్తగా మెడికల్, నర్సింగ్ కాలేజీలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ కొత్తగా ఏర్పడటంతో రాష్ట్ర పునర్నిర్మాణంపైనే ఎక్కువ దృష్టి పెట్టామని, వాస్తవానికి కార్యకర్తలు, ఉద్యమకారులపై దృష్టి సారించలేని.. రానున్న ప్రభుత్వంలో వారికి అధిక ప్రాధాన్యమిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
సర్(ఎస్ఐఆర్)ప్రక్రియపై పార్టీ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని..దొంగ ఓట్లు, పెళ్లి చేసుకుని వెళ్లిన, చనిపోయిన వారి ఓట్లు తొలగించడం, కొత్తగా వివాహాలు అయిన వారి ఓట్లు చేర్చడంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ సభ్యత్వం డిజిటల్ విధానంలో ఉంటుందని.. సభ్యత్వం తీసుకున్న వారికి డిజటల్ కార్డులు వస్తాయన్నారు.
రెండేండ్లు ఓపికగా ఉండి పార్టీ కోసం పని చేయాలని శ్రేణులకు సూచించారు. కాగా, కేటీఆర్ చేవెళ్లకు రాగా పార్టీ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, నరోత్తంరెడ్డి, శ్రీహరియాదవ్, పార్టీ శ్రేణులు, షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, చేవెళ్ల కృష్ణారెడ్డి, గోవర్ధ్దన్‌రెడ్డి, ప్రభాకర్, చేవెళ్ల, శంకర్పల్లి, నవాబుపేట, షాబాద్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు భారీ గజమాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. టపాసులు కాల్చి.. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదా లు చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకుడు పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, జిల్లా మహిళా మాజీ అధ్యక్షురాలు స్వప్నాసతీశ్, బీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గ నేతలు దేశమొళ్ల ఆంజనేయులు, విజయాఆర్య, పట్లోళ్ల కృష్ణారెడ్డి, ప్రభాకర్, విజయభాస్కర్‌రెడ్డి, శ్రీహరియాదవ్, జయవంత్, రావూఫ్, మాణిక్‌రెడ్డి, శ్రీనివాస్, సుధాకర్‌యాదవ్, రాజు, సురేందర్‌గౌడ్, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ కోసం గత బీఆర్ఎస్ హయాంలోనే భూములను సేకరించడం జరిగింది. నేషనల్ హైవే విస్తరణను కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తున్నదని కొందరు గొప్పలు చెప్పడం దారుణం. జాతీయ రహదారి కోసం ఎవరు ఏమి చేశారో చేవెళ్ల ప్రజలకు అన్ని తెలుసు.
గత బీఆర్ఎస్ హయాంలో చేవెళ్లలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటిని అందించాం. చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే వ్యక్తిగత అవసరాల కోసం కాంగ్రెస్‌లో చేరి బీఆర్ఎస్లో ఉన్న వారిని హస్తం పార్టీలో చేరాలని ఎంత ఒత్తిడి చేసినా కాంగ్రెస్‌లో చేరకుండా ఉన్నశ్రేణులకు అభినందనలు.
గతంలో చేవెళ్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండటంతో చేవెళ్ల రాజకీయాలు పట్టించుకోలేదు. ఇప్పటి నుంచి చేవెళ్లలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటా. ఇంద్రారెడ్డి కుటుంబం చేవెళ్ల ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచింది. సర్(ఎస్ఐఆర్) ప్రక్రియలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. దొంగ ఓట్లను తొలగించడంతోపాటు.. కొత్త వారి ఓట్లను చేర్చాలి.
-సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే
30 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించిన వారిపై, బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలిస్తున్నది. రేవంత్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు. ప్రజల్లో ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత వచ్చిన ప్రతిసారీ.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను తిడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్క పనిని కూడా సక్రమంగా చేపట్టంలేదు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నది.
-పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్
పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుతో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో దోహదపడుతుంది. బీఎల్ఏలు ఎంతో అప్రమత్తంగా ఉండి దొంగ ఓట్లు.. మరణించిన వారి ఓట్లను తొలగించడంతోపాటు.. కొత్త వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చించాలి.
-రాంబాబు,ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు చేవెళ్ల ఇన్చార్జి
కాంగ్రెస్ పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగుచెందారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చకపోవడంతో సర్కార్‌పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎవరూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దు.. పార్టీ అండగా ఉంటుంది. రెండేండ్లు ఓపికపడితే వచ్చేది మన ప్రభుత్వమే.
-పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ రెండున్నర పాలనలో అన్నం పెట్టే అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పండించిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రైతులకు ఎరువులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక యాప్ తీసుకొచ్చారు. రైతులు యాప్‌లో ఎరువులు ఎలా బుక్ చేసుకుంటారు. రైతులకు ఇస్తామన్న పంట పెట్టుబడి సాయం ఇవ్వడానికి సీఎం రేవంత్‌రెడ్డికి చేత కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతులకు సరిపడా ఎరువులను ఇవ్వాలి. పశ్చిమ బెంగాల్లో అక్రమంగా కొన్ని ఓట్లను తొలగించడంతో టీఎంసీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. తెలంగాణలో చేపడుతున్న ఎస్ఐఆర్ పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి.
– నాగేందర్‌గౌడ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు
చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగుపెట్టడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నిండింది. ఎస్ఐఆర్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడంతో పార్టీ కార్యకర్తలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ బీఎల్ఏలు భాగస్వాములు కావడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం. పార్టీ కోసం కష్టపడి పని చేయడానికి పార్టీ శ్రేణులమంతా సిద్ధంగా ఉండాలి.
– పట్నం అవినాష్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ, షాబాద్
బీఆర్ఎస్ హయాంలో ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కండ్లలా భావించి సమాంతరంగా తీసుకెళ్లడం జరిగింది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఎంతో అభివృద్ధి చేశారు. పదేండ్ల పాలనలో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందాయి. రానున్న రోజులు బీఆర్ఎస్ పార్టీదే. అందరం సమష్టి కృషితో పార్టీని కేసీఆర్ నాయకత్వంలో బలోపేతం చేసుకుందాం.
– కొంపల్లి అనంతరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు