షాబాద్, జనవరి 17 : రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా రేవంత్‌రెడ్డిని నిలదీద్దామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ యువనేత పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుధర్నా కార్యక్రమానికి కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, శంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, బాల్క సుమన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువనేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. షాబాద్‌లోని హరిజనవాడ చౌరస్తా నుంచి రహదారికి ఇరువైపులా జేసీబీల్లో కార్యకర్తలు నిల్చుని పూలు చల్లుతూ కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని, ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే హామీలను అమలు చేసే బాధ్యత తాను చూసుకుంటానని చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు.
అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు ఎలా చేయిస్తాడని ఎద్దేవా చేశారు. కూటిలో రాయితీయనోడు ఏట్ల రాయి తీస్తడా.. అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ.15వేలు రైతుభరోసా అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలో చందనవెళ్లి, సీతారాంపూర్ గ్రామాల్లో 2500 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అనేక కంపెనీలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఏడాది కాలంలో ఒక్క కంపెనీ తీసుకురాలేదన్నారు. తాము తెచ్చిన కంపెనీలను వారు ప్రారంభించి గొప్పలు చెప్పుకొంటున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయని, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లితో పాటు మిగతా జిల్లాల్లో కలిపి పది స్థానాల్లో ఉప ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయని, తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజలు, రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రైతుభరోసా అందిస్తామని చెబుతున్నదని, కేసీఆర్ హయాంలో నాట్లు వేసేటప్పుడు రైతుబంధు డబ్బులు వేసేవారని, కాంగ్రెస్ హయాంలో ఓట్ల సమయంలో డబ్బులు వేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా విడిచిపెట్టేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి చేవెళ్లలో మళ్లీ గులాబీ జెండాను ఎగురవేసి కచ్చితంగా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయినట్టుగా గొప్పగా స్వాగతం పలికినందుకు అవినాశ్‌రెడ్డిని కేటీఆర్ అభినందించారు. పార్టీ కోసం కష్టపడుతున్న అవినాశ్‌కు భవిష్యత్తులో మంచి అవకాశం ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చిల్కమర్రి నర్సింహులు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మాజీ ఇంచార్జి దేశమళ్ళ ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు నర్సింగ్‌రావు, ప్రభాకర్, గోవర్ధన్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జడల రాజేందర్‌గౌడ్, నక్క శ్రీనివాస్‌గౌడ్, శేరిగూడెం వెంకటయ్య, కొలన్ ప్రభాకర్‌రెడ్డి, పొన్న నర్సింహారెడ్డి, కొంపల్లి అనంతరెడ్డి, ఎంఏ మతీన్, వెంకట్‌యాదవ్, రమేశ్‌యాదవ్, బుర్కుంట సతీశ్, విజయ్‌కుమార్, శ్రీశైలంరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జడల లక్ష్మి, మండల కో-ఆప్షన్ మాజీ సభ్యుడు చాంద్‌పాషా, ఆయూబ్, మాజీ సర్పంచ్‌లు పోనమోని కేతన, కుమ్మరి దర్శన్, కవిత, ఈదుల కృష్ణగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రాంచంద్రారెడ్డి, రాజేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, చంద్రశేఖర్, దేవేందర్‌రెడ్డి, సుదర్శన్, గణేశ్‌గౌడ్, పాండురంగారెడ్డి, పార్టీ నాయకులు నర్సింహులుగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సూద యాదయ్య, శేఖర్, ఆరీఫ్, ముఖ్రంఖాన్, ఇమ్రాన్, ముజీబ్, మంగలి సత్యం, శ్రీశైలం, రాంచందర్, అవిలాశ్గౌడ్ ,అంజయ్య, దర్శన్, గోపాల్, నర్సింహులు, మునీర్, రవి, కృష్ణయ్య, బల్వంత్‌రెడ్డి, కృష్ణగౌడ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ దొంగపార్టీ.. ; మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ
కాంగ్రెస్ పార్టీ దొంగపార్టీ అని, రేవంత్‌రెడ్డి రైతుల కోసం ఎలాంటి పనులు చేయలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి మహామూద్‌అలీ అన్నారు. రైతుల అభివృద్ధి కోసం పాటుపడే ఒకేఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు రైతుల బాగు కోసం నిరంతరం పాటుపడుతున్నారన్నారు. గతంలో 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏనాడూ ఆలోచించలేదని, దేశంలో రైతుబిడ్డగా కేసీఆర్ అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర కరెంట్ సరఫరా ఇచ్చి రైతులను అండగా నిలిచారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని మోసం చేసిందన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉద్యమ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు జైలు అంటే కొత్తేమి కాదని, తప్పు చేయని కేటీఆర్ జైలుకు ఎలా వెళ్తాడని, దొంగపని చేసిన రేవంత్‌రెడ్డి జైలుకు పోతాడన్నారు.
మళ్లీ ఎనుకటి పరిస్థితి వచ్చింది..; మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ రాకముందు మన ఇంటి, ఊరు పరిస్థితి ఎట్లా ఉండేదో యాదిపెట్టుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎన్నికల్లో మరిచిపోయినందుకు మళ్లా ఎనుకటి పరిస్థితులు వస్తున్నాయన్నారు. తెలంగాణ రాకముందు ఇదే రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తాగేందుకు నీళ్లు లేక ఆడబిడ్డలు రెండు, మూడు కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకునేవారని, స్నానాలు చేసేందుకు కూడా ఇబ్బందులు ఉండేవారన్నారు. ఈ ప్రాంతాల నుంచి ముంబయి, పూణె ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగించేవారని, 14లక్షల మంది వలసవెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నారు. తెలంగాణ వచ్చాక పదేండ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామన్నారు. కేటీఆర్ సహకారంతో షాబాద్ మండలంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడంతో లక్షల్లో ఉన్న భూముల ధరలు రూ.కోట్లల్లోకి వెళ్లిపోయాయన్నారు. పేదల భూములను అక్రమంగా లాక్కుంటూ వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. కేటీఆర్‌ను మళ్లీ మళ్లీ ఈడీ, ఏసీబీ ఆఫీసులకు ఎందుకు పిలుస్తున్నారని, కోట్లాడి తెలంగాణ తెచ్చినందుకా, పరిశ్రమలు ఏర్పాటు చేసినందుకా, తెలంగాణను అభివృద్ధి చేసినందుకా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి విజన్ మొత్తం అబద్ధాల మాటలు చెప్పి, కేసులు పెట్టాలే తప్ప చేసిందేమీ లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లు మీ ఇంటికి వస్తారని, మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఉన్న రెండువేల పింఛన్ కూడా రాకుండా చేశారన్నారు. ఓట్లు అడగనీకి వచ్చే కాంగ్రెస్ నాయకులపై తిరుగబడుదాం..ఊరికిద్దాం.. ఒక్కొక్కరిని ఊర్లర్లకి రానీయకుండా హామీలను అమలు చేసిన తర్వాతే వచ్చేలా ప్రశ్నించాలన్నారు. మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టేవారి పేర్లు రాసిపెట్టుకోవాలని, తగిన గుణపాఠం చెబుదామన్నారు.
ఎన్నికల్లో మ్యానిఫెస్టో ఎలా తయారు చేశావు.. ; షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానని చెప్పాడని, రాష్ట్రంలో అప్పులు, ఆదాయం విషయం తెల్వకుండా ఎన్నికల్లో మ్యానిఫెస్టో ఎలా తయారు చేశావని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ అప్పులు చేసి ఎంతో అభివృద్ధి చేశారని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేశాడని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆరు రిజర్వాయర్లు ఉంటే అందులో ఇప్పటికే ఐదు పూర్తి చేశారన్నారు. ఇంకా ఒకటి లక్ష్మీదేవిపల్లి ఉన్నదని చెప్పారు. కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదన్నారు. రైతుభరోసా ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పి రూ.12వేలకు తగ్గించడం సరికాదన్నారు. వానకాలంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసే దిక్కేలేదన్నారు. వడ్లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
ఆరు గ్యారెంటీలు ఏమైనవని అడగండి.. ; బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్
ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం ఇంటింటికీ వచ్చి వివరాలు అడుగుతున్నారని, ప్రజాపాలనలోనే అన్ని వివరాలు ఇచ్చామని, మళ్లీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని మీరంతా నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ఇందిరమ్మ ఇండ్లంటూ డ్రామాలాడుతున్నదన్నారు. పట్నం, బొంబాయి బతుకనీకి పోయినోళ్లకు ఫోన్లు చేసి పిలిపిస్తుండడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఇచ్చిన కార్డులను చూపించి వీటిని ముందు అమలు చేసిన తర్వాతే మా వద్దకు రావాలని ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు.
రైతులను మోసం చేసిన ఘనత రేవంత్‌రెడ్డిదే..; కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో రైతులకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు అని చెప్పి మోసం చేశారని తెలిపారు. బ్యాంకుల్లో రూ.2లక్షలు రుణాలు తెచ్చుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సోనియాగాంధీ జన్మదినం డిసెంబర్ 9న మాఫీ చేస్తానని ప్రగల్భాలు పలికి, అత్తెసరుగా మాఫీ చేయడం ఏమిటని మండిపడ్డారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని కోస్గి మండలంలోనే 20,237 మంది రైతులు రుణాలు తీసుకుంటే, అక్కడ 8647మందికి మాత్రమే మాఫీ అయ్యిందన్నారు. ఇప్పుడెమో ఈ నెల 26 తేదీ నుంచి రైతుభరోసా ఇస్తానని చెబుతున్నాడని చెప్పారు. లగచర్ల ఘటనలో రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించాడన్నారు.
మోసం చేసినోడిని జైల్లో వేయాల్నా, మోసాలను అడ్డుకున్నోడిని జైల్లో వేయాల్నా..; బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్
మోసం చేసినోడిని జైల్లో వేయాల్నా, మోసాలను అడ్డుకున్నోడిని జైల్లో వేయాలో ప్రజలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆస్తులు ఎందుకు కొల్లగొడుతున్నావు ? రైతుల భూములు ఎందుకు గుంజుకుంటున్నావని అడిగినందుకు కేటీఆర్ మీద రేవంత్‌రెడ్డి అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్‌కు నడుచుకుంటూ వస్తే కేటీఆర్ మీద కేసు పెట్టారన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ గూండాలు పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకుంటూ వెళ్లి బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేయడంతో పాటు, కేసీఆర్ ఫొటోను ముక్కలు ముక్కలు చేశారని మండిపడ్డారు. గురుకులాల్లో 54మంది విద్యార్థులకు విష ఆహారం ఇచ్చి చంపారని అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీని, సోషల్ మీడియా కార్యకర్తలను రాత్రికిరాత్రే జైలుకు పంపించిన దుర్మార్గమైనది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.50లక్షల బ్యాగుతో రెడ్‌హ్యాండ్‌డ్‌గా దొరికిన వ్యక్తి జైల్లో ఉండాలే కానీ, దురదృష్టకరం ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. అంబానీ, ఆదానీల దగ్గర నుంచి దొంగచాటుగా రూ.100 కోట్లు తీసుకుని, రూ. 12వేల కోట్ల తెలంగాణ ఆస్తిని ఆదానీలకు కట్టిపెడుతుంటే ఒక్కడే ఒక్కరు కేటీఆర్ పోరాటం చేస్తే ఏసీబీ, ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపియ్యాలని చూస్తున్నాడన్నారు. లగచర్ల రైతులను సంగారెడ్డి జైలులో పెట్టారన్నారు.
రైతాంగం మోసపోయింది..; బీఆర్ఎస్ పార్టీ యువనేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి
గతేడాదిగా తెలంగాణ రైతాంగం అన్ని విధాలుగా మోసపోయిందని బీఆర్ఎస్ పార్టీ యువనేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. రైతుబంధు, రుణమాఫీతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కొందరికే రుణమాఫీ చేసి పూర్తిస్థాయిలో చేశామంటూ గొప్పలు చెప్పుకొంటున్నారన్నారు. ఏడాది పాలన విజయోత్సవాలు చేసుకోవడంలో వాళ్ల కార్యకర్తలు మినహా రైతులు ఎవరూ లేరన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఊర్లల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగే పరిస్థితి లేదు కాబట్టే కొత్తగా మళ్లీ రైతుభరోసా అంటూ రాగమెత్తుకున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట నీటిబుడగలాగా మారిపోయిందని, ఏ ఒక్క హామీనీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదన్నారు.
రైతులను జైలులో పెట్టించిన చరిత్ర రేవంత్‌రెడ్డిది.. ; బీఆర్ఎస్ పార్టీ యువనేత పట్నం అవినాశ్‌రెడ్డి
ఓట్లు వేసి గెలిపించిన లగచర్ల రైతులనే జైలులో పెట్టించిన చరిత్ర రేవంత్‌రెడ్డిదేనని బీఆర్ఎస్ పార్టీ యువనేత పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. రైతులను జైలులో పెట్టిస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క వకీల్‌ను పెట్టి రైతులను బయటకి తీసుకువచ్చారన్నారు. రైతు గురించి ఆలోచించే ఒకే ఒక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అని చెప్పారు. ఎందుకంటే మేము లగచర్ల రైతుల కోసం ఢిల్లీకి వెళ్లామని రైతులు ఎట్ల ఉన్నారని కేసీఆర్ తమను అడిగారని తెలిపారు. రైతుల గురించి ముఖ్యమంత్రికి ఏం తెల్వదన్నారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు ఎన్నో మాటలు తిడుతున్నారని చెప్పారు. ప్రజలు అందరూ కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని అనుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.
రేవంత్‌రెడ్డి చెప్పేది ఒకటి.. చేసేది మరొక్కటి.. ; మాజీ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి
ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలేంటి, ఇప్పుడు చేస్తున్న పనులేమిటని మాజీ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కూర్చుని తెలంగాణలో అందరికీ రుణమాఫీ చేశామని చెబుతుండడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ హయాంలో చినుకులు పడే సమయంలో రైతుబంధు డబ్బులు జమ చేసేవారని, ఫోన్లో టింగ్ టింగ్ శబ్దాలు వచ్చేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక రైతును ఆగమాగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేయాలని, రైతు భరోసా అందించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు పట్టుకుని చూస్తామని, అలాగే ఏడాది కాలంలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో తెలియాలంటే షాబాద్‌ను ఉదాహరణగా తీసుకుంటే సరిపోతుందన్నారు. గతంలో షాబాద్ ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లయిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.