పరిగి, ఆగస్టు 29 : పంటలకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం యూరియా కోసం రైతులు పరిగిలోని ఆగ్రోస్ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టగా మాజీ ఎమ్మెల్యే వారికి మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూస్తే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. తెలంగాణ రాకముందు ఎరువులు, విత్తనాల కోసం రైతులు చెప్పులను లైన్లో పెట్టి గంటల తరబడి నిరీక్షించారని, ప్రస్తుతం అదే పరిస్థితి ప్రతి చోటా కనిపిస్తుందన్నారు.
అన్నదాతలు గత పదిరోజులుగా యూరియా కోసం ఇబ్బందిపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పాసు పుస్తకం, ఆధార్‌కార్డుపై ఒక్క యూరియా బస్తానే ఇస్తుండడంతో ఐదెకరాలు, పదెకరాల భూమి ఉన్న రైతులకు అది ఏ మూలకు సరిపోదని పేర్కొన్నారు. ఎకరాకు సుమారు రూ. 30వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు ఎరువు వేసే సమయంలో యూరియా లభించకుండా పంట దిగుబడిలో ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరోజు కూడా ఎరువుల కోసం ఇబ్బందిలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే ఈ అవస్థ అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఎకరాకు కనీసం రెండు బస్తాల యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే మరోసారి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అడ్డుకున్నారు.
మాజీ ఎమ్మెల్యేను ఆందోళన విరమించాలని స్థానిక ఎస్ఐ మోహన్‌కృష్ణ సూచించగా రైతులకు యూరియా అందిస్తే తాము ఆందోళన విరమిస్తామని ఆయన తేల్చి చెప్పారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏడీఏకు మాజీ ఎమ్మెల్యే ఫోన్ చేసి యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. ఆందోళనలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుం ద అశోక్, మాజీ ఎంపీపీ కరణం అరవిందరావు, మాజీ మార్కెట్ చైర్మన్ సురేం దర్‌కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వెంకటయ్య, భాస్కర్, వెంకట్రాంరెడ్డి, అశోక్‌వర్ధన్‌రెడ్డి, వెంకట రాంకృష్ణారెడ్డి, రవికుమార్, మాణిక్యం, రవీంద్ర, రాం చంద్రయ్య, వెంకటయ్య, శ్రీనివాస్, విజయ్, రైతులు పాల్గొన్నారు.