కేశంపేట, జులై 18 : ఫర్టిలైజర్ దుకాణదారుడి నోటిదురుసుతో కేశంపేట మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ఏవో వచ్చి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేదిలేదని రహదారిపై భీష్మించుకు కూర్చోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఏవో శిరీషతోపాటు స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు.
వివరాల్లోకి వెళ్తే.. కేశంపేట మండల కేంద్రానికి చెందిన చిర్ర యాదయ్య, కడియాల అంజయ్యలు స్థానికంగా ఉన్న శ్రీనివాస నాగలి ఫర్టిలైజర్ దుకాణంలో నానో డీఏపీ, మొక్కజొన్న పంటకు పురుగుల మందుతోపాటు కలుపు మందును కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఆయా మందులకు దుకాణదారుడు చెప్పిన ధరల మధ్య వ్యత్యాసంగా ఉండడంతో పక్క దుకాణంలో తక్కువ ధర ఉన్నాయని, మీరెందుకు ఎక్కువగా చెబుతున్నారని అడగడంతో ఆగ్రహానికి గురైన దుకాణదారుడు నోటికి పని చెప్పాడన్నారు. ‘తన దుకాణం తన ఇష్టమని, తనకు నచ్చిన ధర చెబుతానని, నీ ఇష్టం ఉంటే తీసుకో.. లేదంటే ఇక్కడి నుండి’… అంటూ పత్రికల్లో రాయలేని బూతు మాటలు తిట్టాడని ఆరోపించారు.
విషయాన్ని స్థానికంగా ఉన్న తోటి రైతులకు చెప్పడంతో ఆగ్రహానికి గురైన రైతులు దుకాణంవద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. నిబంధనల ప్రకారం రైతులు, దుకాణదారుడి సంతకాలతో కూడిన రశీదులు సైతం ఇవ్వడంలేదని, నకిలీ రశీదులతో రైతులను మోసం చేస్తున్నారంటూ రహదారిపై బైఠాయించారు. ఏవో వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రహదారిపై ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఘటన స్థలానికి చేరుకున్న ఏవో శిరీష, పోలీసులు ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఏమైనా సమస్య ఉంటే లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, రహదారిపై ప్రజల రాకపోకలకు ఇబ్బందులు సృష్టించవద్దని పోలీసులు సూచించడంతో ఆందోళనకారులు వ్యవసాయశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఫర్టిలైజర్ దుకాణదారులు రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు సాజిద్, మురళీమోహన్‌లు మద్దతు తెలిపారు. కేశంపేటలో ఫర్టిలైజర్ దుకాణాలపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాని డిమాండ్ చేశారు. పోలీసుల రంగం ప్రవేశంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎం.కృష్ణయ్య, మాధవరెడ్డి, రమేశ్‌గౌడ్, ఎ.పారేశ, బి.శేఖర్, సతీశ్, సత్తయ్య, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.