షాద్‌నగర్, జూన్ 17 : ప్రతి రైతు భూమికి సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో కేసీఆర్ పని చేశారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతో కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లో ‘సర్’ (ఓటరు నమోదు) ప్రక్రియపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాజీ మంత్రితో పాటు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, సభ్యత్వ నమోదు ఇన్చార్జి బైకని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. మరోమారు అంజయ్యను అసెంబ్లీకి పంపే వరకు ప్రతీ కార్యకర్త తీవ్రంగా శ్రమించాలన్నారు. నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదును పూర్తి చేయాలన్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదులో భాగంగా ప్రతి సభ్యుడి, సభ్యురాలి వివరాలు పూర్తిగా సేకరించాలని, ఫోన్, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. బీఎల్వోతో ప్రతి బూతు స్థాయి కార్యకర్త సమన్వయపరచుకొని ముందుకు సాగాలన్నారు. నిజమైన ఓటర్లను పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొనేవారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని, రానున్న రోజుల్లో వాళ్లే నాయకులు అవుతారన్నారు.
ప్రభుత్వ పనితీరును ఎక్కడికక్కడ ఎండగట్టాలని, కేటీఆర్ పాదయాత్ర చేస్తా అన్న ఒకే ఒక్క మాటతో కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హుటాహుటిన పాలమూరు జిల్లాలో పర్యటనలు చేస్తున్నాడన్నారు. కేసీఆర్ పాలనలో గురుకులాలను తెరవడంతోపాటు సమయానికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంతో వేలాది విద్యా సంస్థలు సజావుగా సాగాయన్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా మెడికల్, ఇంజినీరింగ్, పీజీ కళాశాలలు మూతపడుతున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పనితీరును కేసీఆర్ మెచ్చుకున్నారని, మచ్చలేని ఇలాంటి వారు చట్టసభల్లో ఉండాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నారాయణరెడ్డి, రవీందర్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, రాంబల్‌నాయక్, రాజావరప్రసాద్, రాజలక్ష్మి, వెంకట్‌రెడ్డి, గణేశ్, నరేందర్, లావణ్య, జగదీశ్వర్‌గౌడ్, నటరాజ్, శ్రీధర్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్, హఫీజ్, పద్మారెడ్డి, మురళీధర్‌రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలో సకల జనులు సంతోషంగా ఉన్నారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ఎన్నో రిజర్వాయర్లు నిర్మించి బీడు భములకు సాగునీరు అందించిన ఘటన కేసీఆర్‌కు దక్కుతుంది. కేసీఆర్ చెప్పేవరకు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు గురించి కాంగ్రెస్‌కు తెలియదు. 90 శాతం పనులు పూర్తైన పాలమూరు లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం హస్యాస్పదంగా ఉన్నది. పాలమూరు ప్రజల శ్రేయస్సు కోసం నాటి సీఎం కేసీఆర్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఐదు ప్రధాన రిజర్వాయర్లను నిర్మించి 90 శాతం మేర పనులు పూర్తి చేస్తే పనులు చేయలేదంటూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు.
రైతులపట్ల చిత్తశుద్ధి ఉంటే పాలమూరు లిప్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే పూర్తి చేసి పాలమూరు జిల్లా రైతులకు సాగునీరు అందించాలి. అన్ని వర్గాల ప్రజలు మరోమారు కేసీఆర్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. నాడు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నేతలు నేడు ఆ ప్రాజెక్టును కడ్తామని చెబుతున్నరు. రైతు బంధు పథకాన్ని పూర్తిస్థాయిలో నీరుగార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా.? కాంగ్రెస్ ఇస్తామన్న తులం బంగారం ఎక్కడికి పాయే. సభ్యత్వ నమోదులో పార్టీ శ్రేణులు ఆసక్తిగా పాల్గొనాలి. ‘సర్’ పట్ల ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి
– మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
ఓటరు జాబితా సవరణలో పార్టీ కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు గణనీయంగా అభివృద్ధి సాధించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి విమర్శలకు తప్పా అభివృద్ధికి దిక్సూచిగా లేడు. రాష్ట్ర ప్రగతి మళ్లీ వెనక్కి పోతున్నది. ఏ పార్టీకైనా పార్టీ కార్యకర్తలే వెన్నుముక అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసి సభ్యత్వంలో ఆదర్శంగా నిలువాలి.
– ఎమ్మెల్సీ సురభి వాణీదేవి
సభ్యత్వ నమోదు ప్రక్రియకు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సహకరించాలి. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం. ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ ఇక్కడి కార్యకర్తల్లో ఎలాంటి వెనుకడుగులేదు. పార్టీ గెలుపే లక్ష్యంగా ఇక్కడి కార్యకర్తలు పని చేస్తున్నారు. త్వరలో కేసీఆర్ సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రతి గ్రామంలో పర్యటించి సభ్యత్వ నమోదును పరిశీలిస్తాం. గతంలో కంటే భారీగా సభ్యత్వాలు నమోదు చేయాలి. అంజయ్యయాదవ్ నాయకత్వంలో రికార్డు సృష్టించాలి. సర్ కార్యక్రమం బూతు లెవల్ స్థాయిలో పరిశీలన కొనసాగాలి. బోగస్ ఓటర్ల తొలగింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సభ్యత్వం పొందిన కార్యకర్తకు రూ.2లక్షల ప్రమాద బీమా కల్పిస్తాం. సమగ్ర ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలి. బీజేపీ వ్యవహరించే తీరు, ఓటరు నమోదుపై చాలా అప్రమత్తంగా ఉండాలి. జూన్ 25 నుంచి జులై 25 వరకు సర్ కార్యక్రమం కొనసాగుతుంది. కార్యకర్తలు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సభ్యత్వాలను పెంపొందించేందుకు కృషి చేయాలి.
– సభ్యత్వ నమోదు ఇన్చార్జి బైకని శ్రీనివాస్‌యాదవ్