హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో డొల్లతనం మరోసారి బయటపడింది. ప్రాజెక్టు అప్పర్ కాఫర్‌డ్యామ్ కుంగింది. మూడు రోజుల క్రితమే నాణ్యతాలోపాలు బయటపడ్డాయి. నిర్మాణ ఏజెన్సీ విషయాన్ని తొక్కిపెట్టి మరమ్మతులను గుట్టుగా నిర్వహిస్తున్నది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరిపై దాదాపు 1.47 కి.మీ. పొడవుతో మట్టి, రాతి కట్టను(ఈసీఆర్ఎఫ్) నిర్మించాల్సి ఉన్నది. అయితే డ్యామ్ పటిష్టంగా ఉండాలన్నా, లీకేజీలు లేకుండా నీరు నిల్వ ఉండాలన్నా తొలుత డయాఫ్రమ్ వాల్ (డీ వాల్) నిర్మించాల్సి ఉంటుంది.
సూటిగా చెప్పాలంటే డ్యామ్ నుంచి నీటి లీకేజీలను అరికట్టేందుకు, భారీ వరదల నుంచి డ్యామ్ పునాదిని పటిష్టంగా ఉంచడంలో ఇది అత్యంత కీలకమైనది. దీని నిర్మాణంలో భాగంగా తొలుత వరద మళ్లింపు కోసం ఎగువ, దిగువన కాఫర్డ్యామ్లను నిర్మించాల్సి ఉండగా ఇప్పటికే ఎగువ కాఫర్‌డ్యామ్ పనులు పూర్తయ్యాయి. ప్రారంభం నుంచి అందులో అడుగడుగునా నాణ్యాతాలోపాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. నీటి సీపేజీలు కొనసాగడం, ఎక్కడో ఒకచోట కుంగడం పరిపాటిగా మారింది. సీపేజీని డైవర్ట్ చేయడానికి ప్రత్యేక స్లూయిస్‌ను ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. నిత్యం కాఫర్ నుంచి నీటిని పంపింగ్ చేయాల్సి వస్తున్నది. కాఫర్ డ్యామ్ పనిచేయకపోవడంతో నీటిని పంపింగ్ చేసేందుకే దాదాపు 50 లక్షల చొప్పున వెచ్చిస్తున్న దుస్థితి నెలకొన్నది. కాఫర్ డ్యామ్ నిర్మాణానికి వాస్తవంగా అయ్యే ఖర్చు కంటే మూడింతలు వెచ్చించినా ఆశించిన ఫలితాలు రాలేదు. తాజాగా మరోసారి కుంగింది.
పోలవరం డ్యామ్‌కు సంబంధించి డీ వాల్‌ను ఎగువన కాఫర్‌డ్యామ్ ఏర్పాటు చేయకుండానే 2017లో దాదాపు రూ. 600 కోట్లు వెచ్చించి 1.3 కిమీటర్ల పొడవుతో, 1.5 మీటర్ల వెడల్పు, 90 మీటర్ల లోతుతో నిర్మాణం చేపట్టారు. 2018 చివరినాటికి పూర్తి చేశారు. 2020లో వచ్చిన వరదలకు డీ వాల్ మూడు చోట్ల దెబ్బతిన్నది. దాదాపు రూ. 500 కోట్ల నష్టం వాటిల్లింది. ఈసీఆర్ఎఫ్ పనులు పూర్తిగా నిలిచిపోగా, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ. 35 వేల కోట్ల నుంచి 55 వేల కోట్లకు పెరిగింది. డీ వాల్ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం అమెరికా, కెనడా తదితర అంతర్జాతీయ నిపుణులను తీసుకువచ్చి అధ్యయనం చేసింది. వైఫల్యాలన్నీ కప్పిపెట్టి కొత్తగా డీ వాల్ నిర్మాణానికి కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపింది. ఇప్పటికే నిర్మించిన డీ వాల్‌కు 6 మీటర్ల ఎగువన 1.47 కి.మీ. పొడవుతో కొత్తగా మరో డీవాల్ను, రూ. 1000 కోట్లతో నిర్మించింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన ఇంజినీరింగ్ లోపాలున్నాయని, అడుగడుగునా భద్రతా ప్రమాణాలు ఉల్లంఘిస్తున్నారని ఏపీ మేధావులు బాహాటంగానే వెల్లడిస్తున్నారు. పోలవరం డ్యామ్‌కు అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో నాణ్యతా లోపాలున్నాయని, పగుళ్లను ప్లాస్టరింగ్ చేసి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని, డీ వాల్ ఎత్తును, గ్యాప్1 లోతును అనధికారికంగా కుదించారని, 2023లో కొట్టుకుపోయిన స్పిల్‌వే గైడ్ బండ్ పునర్నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అది మొత్తం స్పిల్‌వే ఉనికికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. లోపాల వల్ల ప్రాజెక్టు ఉనికికే కాకుండా లక్షలాది మంది ప్రజల జీవితాలకు ప్రమాదం పొంచి ఉన్నదని కేంద్ర సంస్థలకు సైతం పలువురు ఫిర్యాదు చేశారు. కానీ ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) కానీ, కేంద్రజల సంఘం, ఇతర ఏ సంస్థలూ వాటిపై స్పందించలేదు. కానీ తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో అవే సంస్థలు నిత్యం రాద్ధాంతం చేస్తుండడం గమనార్హం.